
‘మానవ సేవే మాధవ సేవ’.. ఈ సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలి. సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయలేనప్పుడు ఆ జీవితం వృథా. అయితే, ప్రస్తుతం సేవారంగం డిజిటల్ రూపం దాలుస్తున్నది. సోషల్ మీడియా వేదికల ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి. ఇందుకు వాట్సాప్ గ్రూప్‌లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని చెప్పవచ్చు. స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు, జిల్లావాసులు, విద్యా, వైద్యం ఇలా.. అనేక రకాల గ్రూపులు ఏర్పాటవుతున్నాయి. వీటిల్లో రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు తెలిస్తే వెంటనే గ్రూపు సభ్యులు స్పందిస్తున్నారు. మానవతా ధృక్పదంతో సాయం చేయాలంటూ ఒక్క మెసేజ్ పెడితే.. మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. బాధిత కుటుంబాల దరికి చేరి ఆపదలో అండగా నిలుస్తున్నారు.
‘దేవుడు అంటే ఎక్కడో ఉండడు..
మనలోనే ఉంటాడు.. ఎదుటి వాళ్లు సాయం అడిగినప్పుడు లోపల నుంచి టప్మని బయటకు తన్నుకొస్తాడు’.. ఖలేజా సినిమాలోని ఈ డైలాగ్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. నిజ జీవితంలోనూ సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనలోని జాలిగుణం, దయా హృదయం సహజంగానే స్పందిస్తుంది. బాధితులకు ఏదో ఒకరూపంలో సాయం చేయాలని అనుకుంటాం. వ్యక్తిగతంగానో.. నలుగురితో కలిసో వారి అవసరాలు తీర్చేందుకు కృషిచేస్తాం. అయితే, ప్రస్తుతం నేటి డిజిటల్ యుగంలో అన్నిరంగాల్లో టెక్నాలజీ ప్రధాన భూమిక పోషిస్తున్నది. పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ గ్రూపులు.. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాంలాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఊరికో వాట్సాప్ గ్రూప్, స్నేహితులకొకటి, జిల్లాకొకటి.. ఇలా అనేక గ్రూప్‌లు ఏర్పాటయ్యాయి. రాజకీయ, సామాజిక, క్రీడా, ఆరోగ్యం తదితర అంశాలపై నిత్యం వీటిల్లో చర్చోపచర్చలు నడుస్తుంటాయి. అలాగే, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ సాయం కావాలన్నా మేమున్నామంటూ గ్రూపు సభ్యులు అండగా నిలబడుతున్నారు.
‘మన గ్రామం- మన తోర్నాల’ ద్వారా సాయం…
ధూళిమిట్టం మండలంలోని తోర్నాలకు చెందిన చొప్పరి లచ్చమ్మ కూతురు చొప్పరి అరుణ అనారోగ్యం కారణంగా మరణించింది. ఏ దిక్కూ లేని కుటుంబం, పూర్తి పేద కుటుంబం కావడంతో ఆ గ్రామ వాట్సాప్ గ్రూపు ‘మన గ్రామం- మన తోర్నాల’లో సాయం చేయాలంటూ అదే గ్రామానికి చెందిన గోనెపల్లి రాజు అభ్యర్థించాడు. దీంతో స్పందించిన గ్రామస్తులు ఆ కుటుంబానికి రూ.14 వేలు సాయం అందించి అండగా నిలబడ్డారు. అలాగే, అదే గ్రామానికి చెందిన పుల్లూరి నరేశ్ అనే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేసి గ్రామస్తులు పెద్ద మనసును చాటుకున్నారు.
డీడీఎఫ్ ఉదారత…
ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ధూళిమిట్ట డెవలప్మెంట్ ఫోరం(డీడీఎఫ్) అనే సంస్థ స్థానిక పేదవారికి సాయం చేస్తున్నది. గ్రామ పంచాయతీ కార్మికుడు నారోజు రాజు ఆకస్మికంగా మృతి చెందడంతో తమ వాట్సాప్ గ్రూపు ద్వారా డబ్బులు సేకరించి ఆయన కుటుంబానికి రూ.10వేలు అందజేసింది. సుద్దాల మహేశ్ అనే వ్యక్తి మరణించగా, ఆయన కుటుంబానికి రూ.5 వేలు, ఇటీవల మరణించిన తుజాలపురం ఎల్లయ్య కుటుంబానికి రూ.5 వేలను తక్షణ సాయంగా ఇచ్చిం ది. కరోనా సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది పేదలను గుర్తించి వారికి పునరావాసం కల్పించి ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం పంపిణీ చేసింది. అలాగే, ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మాధవరెడ్డి రెండేండ్లుగా ధూళిమిట్టలో ఎవరు చనిపోయినా బాధిత కుటుంబాలకు సాయం చేస్తున్నారు. తమ వాట్సాప్ గ్రూప్ వేదికగా విషయాన్ని తెలుసుకొని గ్రామంలోని 37 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
అభివృద్ధి.. సాయం డీడీఎఫ్ లక్ష్యాలు
ధూళిమిట్ట మండల కేంద్రంలో పేదలకు సాయం, తోచిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం డీడీఎఫ్ లక్ష్యం. ఇందులో భాగంగానే ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాం. మా బృందంలో అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఇక ముందు కూడా పేదవారికి డీడీఎఫ్ అండగా ఉంటుంది. మా వాట్సాప్ గ్రూప్‌నకు అండగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు.
వాళ్లు నాకు ధైర్యం ఇచ్చినారు..
నా బిడ్డ చనిపోయినప్పుడు నాకు ఇగ ఎవరూ లేరని మస్తు బాధ అయింది. అప్పుడు మా ఊరోళ్లంతా కలిసి మేమున్నాం అని ధైర్యం చెప్పిన్రు. అందరూ కలిసి నాకు రూ.14వేల ఇచ్చిండ్రు. వాళ్లందరికీ పేరుపేరునా నమస్కారాలు. వాళ్లు చేసిన సాయం శానా పెద్దది.
‘మన జాలపల్లి ముచ్చట్లు’ గ్రూప్ ద్వారా…
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని జాలపల్లికి ‘మన జాలపల్లి ముచ్చట్లు’ వాట్సాప్ గ్రూపు ఉంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలతో రసాభాస సాగుతుంది. అయితే, ఈ గ్రూపులో అదే గ్రామానికి చెందిన గొడుగు సంపత్ మరణవార్త తెలిసింది. అతడిది పేద కుటుంబం. సంపత్‌కు కొడుకు, కూతురు ఇద్దరు చిన్నపిల్లలున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన సాయం వారు చేయండి అంటూ గ్రూపులో మెసేజ్ పెట్టారు. అంతే, తలా ఒక చెయ్యేశారు. మృతుడి కుటుంబానికి రూ.లక్ష పైచిలుకు ఆర్థిక సాయాన్ని అందజేసి శభాష్ అనిపించుకున్నారు.