యాదాద్రి, జనవరి 9 : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వీఐపీ దర్శనానికి 2గంటలు, ఉచిత దర్శనానికి 4గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున 4గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకంతో స్వామివారికి ఆరాధనలు చేశారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు లక్ష్మీసమేత నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనతో అర్చించి, సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలను పఠిస్తూ తిరుప్పావై పూజలు నిర్వహించారు. శ్రీరంగనాయుడిపై గోదాదేవి రచించిన పాశురాలను పఠిస్తూ భక్తులకు వినిపించారు. పాతగుట్ట ఆలయంలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ. 23,09,070 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానాకు రూ. 23,09,070
ప్రధాన బుక్కింగ్ ద్వారా 3,07,450
వీఐపీ దర్శనం 2,55,000
వేద ఆశీర్వచనం 15,600
నిత్యకైంకర్యాలు 2,400
సుప్రభాతం 1,400
ప్రచారశాఖ 28,300
క్యారీబ్యాగుల విక్రయం 11,000
వ్రత పూజలు 1,04,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 37,200
ప్రసాద విక్రయం 10,61,500
వాహనపూజలు 21,900
టోల్గేట్ 1,920
అన్నదాన విరాళం 22,840
సువర్ణ పుష్పార్చన 1,36,000
యాదరుషి నిలయం 80,430
పాతగుట్ట నుంచి 57,020
గోపూజ 300
ఇతర విభాగాలు 1,34,010