తెలుగుయూనివర్సిటీ : అధికారిక కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి. వెంకటేశ్వరన్ పబ్లిక్‌గార్డెన్ ప్రాంగణంలో గల స్టేట్ మ్యూజియం బుద్దిస్ట్ కల్చరల్ గ్యాలరీని బుధవారం సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను వెంకటేశ్వరన్‌కు వివరించారు.
హుస్సేన్ సాగర్ జలాశయంలోని ఆర్యసీతార క్రూస్ బోటులో ప్రయాణించి సాగర్‌లోని 72 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లంబినిపార్కు, స్టేట్ మ్యూజియంను సందర్శించిన ఆయన తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా నిలిచిన పలు చారిత్రక, పురాతన వస్తువులను గురించి శ్రీనివాస్ గుప్తా వివరించారు.
పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ భవిష్యత్తులో రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సంయుక్తంగా చేపట్టవలసిన పలు విషయాలపై చర్చించారు.