
నారాయణపురం, జనవరి 9 : అసలే చలికాలం ఆపై గజగజ వణికిస్తున్న చలి.. పిల్లలు, అయిన వాళ్లు, ఆదరించే వారు కరువయ్యారు. ఇల్లు కూలిపోవడంతో మైనార్టీ కమ్యూనిటీ హాల్ వరండాలోనే చలికి వణుకుతూ జీవనం సాగిస్తూ నరకయాతన అనుభవిస్తున్నది ఒంటరి వృద్ధురాలు దాశమ్మ. మండలం కేంద్రానికి చెందిన గుండమల్ల దాశమ్మ మారయ్య నిరుపేద దంపతులు. కూలి పనులు చేస్తూ బతుకెళ్ల దీసేవారు. 8 ఏండ్ల క్రితం భర్త మారయ్య అనారోగ్యంతో చనిపోయాడు. శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోవడంతోపాటు పిల్లలు కూడా లేకపోవడంతో దాశమ్మ వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. 5 ఏండ్లుగా మండల కేంద్రంలోని మైనార్టీ కమ్యూనిటీ హాల్ వరండాలోనే బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా అందించే రేషన్ బియ్యం, వృద్ధాప్య పింఛన్ డబ్బుతోనే కాలం వెళ్లదిస్తున్నది. బీపీ, షుగర్‌తోపాటు చెవులు వినిపించడం లేదని దాశమ్మ వాపోతున్నది. పట్టెడు అన్నం పెట్టేవారు లేకుండా పోయారని తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. మందులకు డబ్బులు సరిపోవడం లేదని సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నది. ఇన్ని సమస్యల మధ్య బతకడం కన్నా.. చనిపోయినా బాగుండేదని, తన లాంటి బాధలు ఎవరికీ రావొద్దని వృద్ధురాలు కన్నీటి పర్యంతమవుతున్నది. చలికి బయట ఉండలేక పోతున్నాని మనసున్న మహారాజులు తనకున్న స్థలంలో చిన్నగూడు నిర్మించి ఇవ్వాలని దీనంగా వేడుకుంటున్నది దాశమ్మ.
బయట ఉండలేకపోతున్నా..
నాకు ఎవరూ లేరు ఒంటరి దాన్ని. ఇల్లు కూలిపోవడంతో ఐదేండ్లుగా షాదీఖాన వరండలోనే ఉంటున్నా. సర్కారు ఇచ్చే పింఛన్ డబ్బులతోనే బతుకుతున్న. నాకు చెవులు వినిపించవు. సర్టిఫికెట్ ఇస్తే పింఛన్ ఎక్కువ వస్తుందని తెలిసివాళ్లు చెప్పిర్రు. సర్టిఫికెట్ ఇప్పించండి. మందులకు డబ్బులు సరిపోవడం లేదు. రాత్రి పూట పాములు, తేళ్లు వస్తున్నయి. చలికి బయట ఉండలేకపోతున్న. నాకు ఇంటి స్థలం ఉంది..ఎవరైనా రెండు రేకులతో చిన్నగూడు కట్టించి ఇవ్వండి. మీకు రుణపడి ఉంటా.