యాసంగి సీజన్ వచ్చేసింది.. రైతన్నకు సాగు పండుగ తెచ్చింది.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది.. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి రైతుల జాబితాను నివేదించారు. ఈ నెలాఖరులోపు అర్హులైన ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో పెట్టుబడి సాయం జమకానున్నది. పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో 3.16 లక్షల మంది, భద్రాద్రి జిల్లాలో 1.40 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. రైతుల ఖాతాలో రూ.576.72 కోట్లు జమకానున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 19: రైతాంగం పంటల సాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఏటా రెండు సీజన్లలో రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ జమ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఒక్కో రైతుకు ఏటా రూ.10 వేల చొప్పున నగదు అందుతున్నది. ఉమ్మడి పాలనలో రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేదు. పంట దిగుబడి వచ్చిన తర్వాత వచ్చే డబ్బులో సింహభాగం అప్పులు, వడ్డీలకే సరిపోయేది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితి నుంచి రైతులను బయటకు తీసుకువచ్చింది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో మరి కొద్ది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నది. ఇప్పటికే వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సర్కార్‌కు నివేదించింది. కొత్తగా పాస్‌పుస్తకాలు తీసుకున్న వారికి సైతం పెట్టుబడి సాయం అందుతుంది. ఈ నెల 28 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానున్నది. నెలాఖరులోపు విడతల వారీ రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నది. 2018లో రైతుబంధు పథకం ప్రారంభం కాగా సర్కార్ మొదట్లో సీజన్‌కు ఎకరానికి రూ.4 వేలు చొప్పున అందించింది. 2020 నుంచి ఎకరానికి సీజన్‌కు రూ.5 వేల చొప్పున అందిస్తున్నది. ఖమ్మం జిల్లాలో రుణమాఫీ పథకం ద్వారా రైతాంగానికి రూ.17వేల కోట్ల రుణమాఫీ జరిగింది. దీంతో సన్న, చిన్నకారు రైతులు తమ భూములను కాపాడుకోగలిగారు. జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మందికి లబ్ధి చేకూరింది.
ఖమ్మం జిల్లాలో..
యాసంగిలో ఖమ్మం జిల్లాలో 3,16,385 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.362.76 కోట్ల నిధులు జమకానున్నాయి. జిల్లాలో 2018 నుంచి ఈ ఏడాది వానకాలం వరకు ప్రభుత్వం రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో రూ.2060.91 కోట్లు అందజేసింది. ఈ యాసంగి సీజన్లో కామేపల్లి మండలంలో 10,675 మంది రైతులు ఖమ్మం అర్బన్ 3,798 మంది, రఘునాథపాలెం 16,329 మంది, ఖమ్మం రూరల్ 15,621 మంది, కూసుమంచి 18,041 మంది, నేలకొండపల్లి 18,597 మంది, తిరుమలాయ పాలెం 19,389 మంది, బోనకల్ 16,465 మంది, చింతకాని 16,791 మంది, మధిర 18,535 మంది, ముదిగొండ 17,632 మంది, ఎర్రుపాలెం 15,379 మంది, కల్లూరు 20,719 మంది, పెనుబల్లి 12,782 మంది, సత్తుపల్లి 12,742 మంది, తల్లాడ 16,685 మంది, వేంసూరు 17,305 మంది, ఏన్కూరు 8,393 మంది, కొణిజర్ల 15,650, కారేపల్లి 11,823 మంది, వైరా మండలంలో 13,071 మంది రైతుబంధుకు అర్హులు.
భద్రాద్రి జిల్లాలో ఇలా..
భద్రాద్రి జిల్లాలో యాసంగిలో 1,40,931 మంది రైతులకు రైతుబంధు అందనున్నది. వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.214 కోట్ల జమ చేయనున్నది. అన్నపురెడ్డిపల్లి మండలంలో 4,057 మంది, అశ్వారావుపేట 10,498 మంది, చండ్రుగొండ 5,199 మంది, దమ్మపేట 10,446 మంది, ములకలపల్లి 7,539 మంది, భద్రాచలం 39 మంది, చర్ల 10,290 మంది, దుమ్ముగూడెం 12,762 మంది, చుంచుపల్లి 685 మంది, జూలూరుపాడు 9,063 మంది, కొత్తగూడెం 264, లక్ష్మీదేవిపల్లి 3,251, పాల్వంచ 5,893 మంది, సుజాతనగర్ 6,004 మంది, ఆళ్లపల్లి 3,437 మంది, అశ్వాపురం 6,021 మంది, బూర్గంపాడు 6,920 మంది, గుండాల 5,192 మంది, కరకగూడెం 3,757 మంది, మణుగూరు 2,764 మంది, పినపాక 5,501 మంది, టేకులపల్లి 10,974, ఇల్లెందు మండలంలో 10,315 మంది అర్హులు.
కొత్తగా 1,094 మందికి లబ్ధి..
యాసంగికి ముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అవుతున్నది. ఈ సీజన్‌కు జిల్లా రైతులకు రూ.214 కోట్ల్ల నిధులు మంజూరయ్యాయి. ఈసారి కొత్తగా 1,094 మందికి రైతుబంధు మంజూరైంది. వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నాం. యాసంగికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం.
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించే ఆలోచన చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నాలుగేళ్ల నుంచి రైతులకు రైతుబంధు అందుతున్నది. రైతాంగం పథకం లబ్ధి కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండానే దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. సాయం పొందిన రైతులు ముందస్తుగానే మందుకట్టలు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
-కూరాకుల నాగభూషణం, ఖమ్మం డీసీసీబీ చైర్మన్
రైతాంగానికి అప్పుల బాధ తప్పింది
రైతుబంధు పథకం అమల్లోకి వచ్చిన తరువాత రైతులకు అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. ఖమ్మం జిల్లా రైతులకు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.600 కోట్ల నిధులు కేటాయిస్తున్నది. పథకం ద్వారా ప్రతి సీజన్లో 3 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది. రాజకీయాలకు అతీతంగా రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. రైతులు ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే అవసరం లేదు. వారికి అప్పులు, వడ్డీల బాధ లేదు.
-డౌలే లక్ష్మీప్రసన్న,ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్
సాగుకు ముందే రైతుబంధు..
ప్రభుత్వం ఏటా సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందిస్తున్నది. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన పని లేదు. రైతులకు సకాలంలో సాయం అందుతుంది. ఈ డబ్బుతో ఎరువులు, విత్తనాలను కొంటున్నాం. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయడానికి సిద్ధ్దంగా ఉన్నాం.
-వి.వెంకన్న, పోకలగూడెం, రైతు
రైతులకు వరం..
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతుబంధు అమలవుతున్నది. నాలుగేళ్ల నుంచి ప్రతి సీజన్లో రైతులకు రైతుబంధు అందుతున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తున్నది.
సర్కార్‌కు కృతజ్ఞతలు..
సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతుబంధు పథకం అమలు చేస్తున్నారు. గతంలో సీజన్ వచ్చిందంటే ఎంతో మంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీసేవారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. తెలంగాణ సర్కార్ సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతుల బాధలు తప్పాయి.