
చండ్రుగొండ, డిసెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను రైతులు పాటించడం మొదలెట్టారు. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో రావికంపాడు గ్రామానికి చెందిన నిజాంపట్నం రామకృష్ణ తనకున్న ఎకరం పొలంలో అర ఎకరం మొక్కజొన్న(స్వీట్‌కార్న్), మరో అర ఎకరంలో టమాటా సాగు చేస్తున్నాడు. వ్యాపారులు, స్థానికులు రైతు వద్దకే వచ్చి టమాటా కిలో రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నారు. అర ఎకరంలో టమాటా సాగు చేయటం వల్ల పెట్టుబడి పోను రూ.40 వేలు లాభం వచ్చిందని రైతు తెలిపాడు. అదేవిధంగా మరో అర ఎకరంలో వేసిన మొక్కజొన్న(స్వీట్‌కార్న్) పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. రూ.50 వేల వరకు లాభం వస్తుందని రైతు ఆశిస్తున్నాడు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతుండడంతో రైతులు ఆ దిశలో పయనిస్తున్నారు.
తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం
నా ఎకరం భూమిలో వరికి బదులు మెరక పంటలను సాగు చేస్తున్నాను. అర ఎకరంలో టమాటా, మరో అర ఎకరంలో మొక్కజొన్న వేశాను. రూ.లక్ష వరకు లాభం వస్తుందని ఆశిస్తున్నాను. ఈ రకం పంటలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందొచ్చు. అవగాహన కల్పిస్తే మరింతమంది రైతులు ఇతర పంటలు వేసే అవకాశం ఉంది.