కమ్మర్పల్లి, జనవరి 3 : ఆక్సిజన్ అందక ఒక్క కొవిడ్ రోగి కూడా మృతి చెందరాదన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపుమేరకు ఆయన సతీమణి వేముల నీరజారెడ్డి, మిత్రబృందం దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను కల్పిస్తున్నారు. కోటిన్నర రూపాయలతో జిల్లాలోని పలు ప్రభుత్వ దవాఖానలకు ఆక్సిజన్ బెడ్ల సౌకర్యం కల్పించారు.
కొవిడ్ వేళ రోగులకు ప్రాణ వాయువు అందించేందుకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్ర దవాఖానతోపాటు ఆర్మూర్ దవాఖాన, మంత్రి ప్రాతినిధ్యం వహించే బాల్కొండ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ దవాఖానలకు ఆక్సిజన్ బెడ్లు సమకూరాయి. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి సర్కారు దవాఖానకు సుమారు 50 ఏండ్లుగా మెరుగైన ప్రసూతి సేవలందిస్తున్నదని పేరు ఉన్నది. ఈ దవాఖానలో గర్భిణులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశారు. దీంతో శ్వాస సమస్యతో బాధపడే వారితో పాటు గర్భిణులకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి. చౌట్పల్లి దవాఖానకు భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల నుంచి గర్భిణులు పెద్దసంఖ్యలో వస్తారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ దవాఖానలో ప్రసూతి సౌర్యాలను మెరుగుపర్చారు. కానీ ప్రసూతి సమయంలో రక్తహీనతతో పాటు ఇతర సమస్యలతో బాధపడే గర్భిణులను ఆర్మూర్‌కు తరలిస్తారు. మంత్రి మిత్రుల సహకారంతో సమకూర్చిన ఆక్సిజన్ బెడ్ల సౌకర్యంతో ఇక ఆ సమస్య కూడా తీరనున్నది.
నేడు ప్రారంభించనున్న మంత్రి..
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీతోపాటు పలు దవాఖానల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. చౌట్పల్లి దవాఖానలో ఐదు ఆక్సిజన్ బెడ్లు, ఆర్వోఆర్ వాటర్ యూనిట్, రిసెప్షన్ కౌంటర్, కమ్మర్‌పల్లిలో ఆరు ఆక్సిజన్ బెడ్లు, రిసెప్షన్ కౌంటర్‌ను ప్రారంభించనున్నారు.
నేడు, రేపు మంత్రి వేముల పర్యటన
వేల్పూర్, జనవరి 3 : జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ నెల 4, 5వ తేదీల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు కమ్మర్పల్లి పీహెచ్సీ, చౌట్పల్లి, భీమ్‌గల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్లను మంత్రి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 9.30 గంటలకు మోర్తాడ్ మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు పాలెంలో, మధ్యాహ్నం 3 గంటలకు దొన్కల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.