ఖలీల్‌వాడి, జనవరి 6 : నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగి ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా బుధవారం 18 కేసులు నమోదుకాగా… గురువారం ఒక్కరోజే 30 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ప్రజలు నిర్లక్ష్యం వదిలి కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని వైద్యులు సూచించారు.
జిల్లాలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 15 నుంచి 18 ఏండ్ల యువకులు టీకాలు తీసుకోవాలని సూచించారు. గుంపులుగుంపులుగా ఉండే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 55,688 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో ఐదు కరోనా కేసులు
విద్యానగర్, జనవరి 6 : కామారెడ్డి జిల్లాలో గురువారం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 135 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదు కేసులు పాజిటివ్ వచ్చాయని తెలిపారు. బాన్సువాడలో 1, ఎల్లారెడ్డిలో 3, నాగిరెడ్డిపేట్లో ఒక కేసు నమోదైనట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 31,766 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని వైద్యులు కోరారు.
నాగిరెడ్డిపేట్కు చెందిన ముగ్గురికి..
ఎల్లారెడ్డి రూరల్ జనవరి 6 : ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో గురువారం 16 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు దవాఖాన వైద్యులు తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండలం వెంకంపల్లి గ్రామానికి చెందిన ఒకరికి, తాండూర్ గ్రామానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చినట్లు వెల్లడించారు.