
మహబూబ్‌నగర్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో వ్యవసాయ రంగాన్ని అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ, శవయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలో నల్లదుస్తులు ధరించిన మంత్రి డప్పు కొట్టారు. దిష్టిబొమ్మ పాడె మోశారు. తెలంగాణ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని, అన్నదాతలు బాగుపడిన విధానాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరు బీజేపీ ఎమ్మెల్యే, ప్రజలు తెలంగాణలో విలీనం చేయాలని అంటున్నారని గుర్తు చేశారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న అన్నదాతపై కేంద్రం కత్తి దూస్తుందన్నారు. విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పజెప్పాలని చూస్తున్నదని తెలిపారు. తెలంగాణ సర్కార్ ఉచితంగా ఇస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టి అన్నదాతను ఆగం చేసే కుట్రకు కేంద్రం తెరలేపుతోందన్నారు. ఉచిత విద్యుత్ ఆపేస్తే రైతుల పరిస్థితి ఏమైపోవాలని ప్రశ్నించారు. పంజాబ్‌లో ధాన్యం కొంటరు.. తెలంగాణలో కొనరు.. పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. కేం ద్రంపై పోరులో తగ్గేదేలేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం దిగివచ్చి తెలంగాణ రైతుల ధాన్యం కొని రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మ న్ కొరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి అ ధ్యక్షులు, సభ్యులు, రైతులు, రైతు సంఘాల నేత లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.