పత్తి రైతు పంట పండింది. వరికి బదులుగా తెల్లబంగారం సాగుచేయగా, ఈ ఏడాది మార్కెట్లో కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి డిమాండ్ ఏర్పడడంతో క్వింటాలు ధర ఏకంగా రూ.10వేలకు చేరువైంది. ప్రస్తుతం కనిష్ఠంగా రూ.8,850 నుంచి గరిష్ఠంగా రూ.9050 వరకు ధర పలుకుతున్నది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో రూ.9100 లకు పత్తి అమ్ముడైందని రైతులు చెబుతున్నారు. వ్యాపారులే రైతుల వద్దకు వచ్చిమరీ పత్తిని సేకరిస్తున్నారు. ఇతర పంటలను సాగుచేయాలని ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పించిన కారణంగా.. నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ తదితర నియోజకవర్గాలకు చెందిన రైతులు పత్తిని సాగు చేసి, ప్రస్తుతం మద్నూర్లోని జిన్నింగ్ మిల్లుల వద్ద విక్రయిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా పత్తి రూ.6,025 మాత్రమే పలుకుతుండగా, మద్నూర్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఈ సీజన్లో కిలో పత్తి కూడా కొనకపోవడం గమనార్హం.
నిజామాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరి బదులుగా తెల్ల బంగారం సాగు చేసిన రైతులకు కనక వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో ధర లభిస్తోంది. క్వింటాలు ధర ఏకంగా రూ.10వేలకు చేరువవుతుండడంతో రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి పత్తిని సేకరిస్తుండగా, పలు కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లు ల వద్ద కొనసాగుతున్న పత్తి సేకరణకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కనిష్ఠంగా క్వింటాలు పత్తి రూ.8,850 నుంచి గరిష్ఠంగా రూ.9,050 వరకు పలుకుతున్నది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో రూ.9,100 లకు పత్తి అమ్ముడైందని రైతులు చెబుతున్నారు. వానకాలం ప్రారంభంలో రైతులకు ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పించింది. ఏడాది కాలంగా ఇతర పంటలు సాగు చేయాలంటూ చెబుతోంది. కొద్ది మంది సర్కారు సూచనలు పాటించి ఇప్పుడు సంతోషంగా గిట్టుబాటును దక్కించుకుంటున్నారు. మద్నూర్‌లో జిన్నింగ్ మిల్లుల వద్ద నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన రైతులు పత్తిని తీసుకువచ్చి విక్రయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు పత్తి రూ.6,025 పలుకుతుండడం విచిత్రం.
రికార్డు ధర.. రూ.9,050
ఉమ్మడి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో అత్యధికంగా పత్తిని సాగు చేస్తున్నారు. గత సీజన్లో పత్తి పంట వేసిన రైతులకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. పత్తి పంట సాగు చేసిన రైతుల వద్దకే ప్రైవేటు వ్యాపారులు వచ్చి పంటను అత్యధిక ధరకు సేకరిస్తున్నారు. భారీ స్థాయిలో క్వింటాలు తెల్లబంగారం అమ్ముడవుతుండడంతో రైతుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చెప్పినట్లుగానే పత్తి పంటను సాగు చేసి ఉంటే అధిక లాభాలు వచ్చేవని మిగితా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2020-21లో కేంద్రం ప్రకటించిన ఆయా పంటలకు కనీస మద్దతు ధరలో పత్తికి క్వింటాలుకు రూ.5,515 మాత్రమే ఉంది. 2021-22లో రివైజ్డ్ మద్దతు ధరల్లో క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర పొట్టి గింజ రూ. 5,726, పొడు గింజ రూ.6,025గా నిర్ణయించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రా ల్లో రైతులకు దక్కే మద్దతు ధర గరిష్ఠంగా రూ.6,025 మాత్రమే. ప్రైవేటు కొనుగోళ్లలో రికార్డు స్థాయిలో పత్తికి ధర లభిస్తున్నది. డిసెంబర్ 29, 30వ తేదీల్లో వరుసగా క్వింటాలుకు రూ.9,050 పలికినట్లుగా రైతులు చెబుతున్నారు. చిన్న గింజ కలిగిన పత్తికి రూ.8,885 వరకు ధర వచ్చింది.
ఇతర పంటల సాగుపై ఆసక్తి
దేశంలోనే పంటల ఉత్పత్తిలో మన రాష్ట్రం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక్కడ సమ శీతోష్ణ పరిస్థితులు ఉండడంతో అన్ని రకాల పంటలు పండుతాయి. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను బేరీజు వేసుకుని రైతులు సాగు చేస్తే లాభం చేకూరుతుంది. ఇక మీదట వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రైతులు అదే దారిలో నడవాల్సిన అవసరం ఏర్పడింది. ఏ నేలలు ఏ పంటల సాగుకు అనుకూలమో స్థానిక వ్యవసాయ అధికారులు ధ్రువీకరిస్తారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ సైతం వ్యవసాయ శాఖకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇతర పంటల సాగుతో రైతులకు అధిక లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు ఈ వానకాలం సీజన్లో అనూహ్యంగా తగ్గినప్పటికీ వచ్చే ఏడాది సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నా రు. దీర్ఘకాలిక పంటగా గుర్తింపు పొందిన పత్తితో రాబడి ఉండడంతో గిట్టుబాటు ఉన్న సమయంలో లాభం చేకూరుతుంది. పైగా పత్తి ఏరడం పూర్తయిన తర్వాత శనగ, కుసుమ, నువ్వులు వంటి ఇతర పంటలను సైతం రైతులు సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
కేంద్రం కిలో కూడా కొనలేదు..
కేంద్ర ప్రభుత్వం తీరు ‘నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయంలో పూటకో పేచీ పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వడ్ల విషయంలో రాజకీయం చేసి రైతులను ఆగం చేసేందుకు బీజేపీ కుయుక్తులను పన్నుతోంది. వడ్లు వద్దంటూ చెబుతున్న కేంద్రమే పత్తి పంటను సాగు చేసిన రైతుల నుంచి మాత్రం పంటను సేకరించడం లేదు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరను మాత్రం రూ.6,025గా భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలోని కేంద్రాల్లో ప్రకటించడం విడ్డూరంగా మారింది. కానిక్కడ ప్రైవేటు వ్యాపారులు ధైర్యంగా ముందడుగు వేసి రైతుల నుంచి పత్తిని రూ.9వేలకు సేకరిస్తుండడం గమనార్హం. మొత్తానికి ఏ పంటలు సాగు చేసినప్పటికీ రైతుల నుంచి పంటలను సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందనడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా మార్కెట్ బాగుండడంతో ప్రైవేటు వ్యాపారులు ఎగబడి రైతుల నుంచి గిట్టుబాటుకు పత్తిని సేకరిస్తున్నారు. మద్నూర్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఈ సీజన్లో కిలో పత్తి కూడా కొనకపోవడం విడ్డూరం.
మంచి ధర వచ్చింది
పత్తికి మంచి ధర వచ్చింది. మేము ఇంతగానం ధర వస్తదని ఊహించలేదు. వరి బదులుగా పత్తి సాగు చేసు ట్ల లాభం మస్తుగుంది. నాకు క్వింటాలుకు రూ.8,885 గిట్టుబాటు అయ్యింది. సంతోషంగానే ఉంది. పోయిన ఏడాది ఇంత మంచి రేటు లేకుండే. ఎట్లుంటుందో అనుకున్నాము. ధర మంచిగానే వచ్చింది.
గిట్టుబాటు అయితున్నది..
మా పొలాల్లో వేరే పంటలు సాగవ్వవు. పత్తి తప్ప మిగిలిన పంటలు వేసుకోలేము. రాళ్లు, రప్పలే ఉన్న భూముల్లో పత్తి వేసి కుటుంబానికి ఆదాయం పొందుతున్నాము. ఈసారి పత్తి ధర బాగా వచ్చింది. ఇంత వస్తదని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.
రూ.9వేలకు అమ్మిన…
నాకున్న నాలుగు ఎకరాల భూమిలో పత్తి వేసిన. ఏరిన పత్తిని ఏరినట్లే మార్కెట్‌కు తెస్తున్న. జిన్నింగ్ మిల్లు వ్యాపారులు మంచి ధరకే పత్తి కొంటున్నరు. పది క్వింటాళ్లు అమ్ముకున్నా.. క్వింటాలుకు రూ.9,050 వచ్చింది. ఇంత ధర ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు ఇట్లనే కాలం ఉంటే మంచిగుంటది.