నిజామాబాద్ జిల్లాలో ఒక రోజు పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ చివరివారంలో సీఎం కేసీఆర్ పర్యటన ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన నేపథ్యంలో జిల్లాల పర్యటనకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలో రానున్నారు. ఈ నెల చివరి వారంలో సీఎం కేసీఆర్ పర్యటన ఉండే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన నేపథ్యంలో జిల్లాల పర్యటనకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని సైతం ప్రారంభించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. సీఎం పర్యటన సమాచారం రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గడిచిన మూడు రోజులుగా యంత్రాంగంలో సీఎం టూర్ ఏర్పాట్ల హడావుడి కనిపిస్తున్నది. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు. దీంతోపాటు బైపాస్ రోడ్డు వెంట సుందరీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. బైపాస్ రోడ్డు వెంట మొక్కలు నాటుతుండడంతోపాటు రోడ్లపై గుంతలను పూడ్చివేయిస్తున్నారు. బైపాస్ వద్ద ఈ మధ్యే వరద నీటితో దెబ్బతిన్న తారు రోడ్డుకు మరమ్మతులు చేశారు. అవసరమైన చోట కొత్తగా బీటీ రోడ్డు సైతం వేస్తున్నారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ హెలికాప్టర్లో నిజామాబాద్‌కు వస్తే పాలిటెక్నిక్ మైదానంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేయనున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ వచ్చే అవకాశాలున్నట్లుగా అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు.