రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా దేవరకొండ ఖిలా చరిత్రలో మిగిలిపోయింది. సుమారు 700 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఖిలా పరిరక్షణ, అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు చెదిరిపోకుండా రూ.కోట్లాది నిధులతో పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నది. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా దేవరకొండ దుర్గం మరింత శోభను అద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో వందేండ్ల కిందటి జీవన సౌందర్యపు చిత్రాలను ఆవిష్కరిస్తూ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఈ నెల 11 నుంచి 18వరకు ఫొటో ఎగ్జిబిషన్ జరుగనున్నది. -దేవరకొండ,
చారిత్రక నేపథ్యం..
దేవరకొండ ఖిలాను వెలమరాజులు పరిపాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ. 1361 సంవత్సరంలో అనపోత యాదవనాయకులు రాచకొండ, దేవరకొండ దుర్గాలు నిర్మించి ప్రభువులు అయ్యారు. క్రీ.శ. 1361 నుంచి 1384 వరకు దేవరకొండ ఖిలా అధిపతులుగా కొనసాగారు. ఆ తర్వాత 1399 వరకు రెండో అనపోత నాయకుడు, 1421 నుంచి 1430 వరకు అనపోతనేని రెండో సోదరుడు పరిపాలించాడు. 1475 వరకు లింగనేడు, 1482 వరకు అంగనేడు ఖిలాను పరిపాలించారు. దేవరకొండ దుర్గాన్ని యాదవనాయకుడు, మాధవరావు, పర్వత్‌రావు, నేహాద్రిరావు, ధర్మారావు, లక్ష్మణరావు అనే రాజులు పరిపాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. హైదరాబాద్ నవాబు కులీ కుతుబ్‌షాహీ దేవరకొండ కోటను సందర్శించి ఆకర్షితుడై 16వ శతాబ్దంలో ముట్టడించి విలువైన సంపదను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెప్తున్నది. ఖిలాపై శివరాత్రి, ఏకాదశికి ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతాయి. పరిసర గ్రామాల ప్రజలు అధికంగా తరలివస్తుంటారు. ఖిలా కొండపైన ఓంకారేశ్వర్ శివాలయం ఆలయానికి ఉత్తరభాగాన మంచినీటి కోనేరు ఉన్నది. ఆ కోనేరులో నీళ్లు చాలా పరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. వేసవిలోనూ కోనేరు ఎండిపోకపోవడం విశేషమని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఖిలా ప్రవేశంలో రెండు సింహద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు ఏడు గుట్టలను కలిపిన ద్వారాలుగా మిగిలిపోయాయి. స్వింహద్వారాలు దాటి కోటలోకి వెళ్లగానే రేచర్ల వెలమవీరులు ఉపయోగించిన ఫిరంగులు దర్శనమిస్తాయి. ఈ విశాలమైన ప్రదేశంలో గండిపేట నీటిని తలపించేలా రెండు నీటి బావులు, రెండు కుంటలు వుంటాయి. అవి ఖిలాకు కాపలా ఉండే సైనికులు తాగు నీటి కోసం ఉపయోగించినట్లు తెలుస్తుంది. సమీపంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, మూడు ధాన్యాగారాలు ఉన్నాయి. మూడు స్వింహద్వారాలు దాటి ఖిలా పైకి వెళ్తే రాజ్యచిహ్నమైన ధర్మచక్రం దానికి రెండు వైపులా సింహాలు చెక్కి వున్నాయి. ఈ మూడు సింహద్వారాల్లో మొదటి ద్వారానికి తాబేలు (కూర్మం) బొమ్మ చెక్కి ఉన్నది. ఐదో సింహ ద్వారంలో పలుచోట్ల అరుగులపై సిపాయిలు ఆడినట్లుగా ‘పచ్చీస్’ నమూనా చెక్కిఉన్నది.
రేపు ఫొటో ఎగ్జిబిషన్..
పురవస్తు శాఖ ఉన్నతాధికారులు గతేడాది దేవరకొండ ఖిలాను సందర్శించారు. ఈ సందర్భంగా శాట్‌లైట్ ద్వారా చిత్రీకరించారు. 100ఏండ్ల నాటి జీవన విధానానికి సంబంధించిన ఫొటోల ద్వారా మరికొంత సమాచారాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11 నుంచి 18 వరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో వారం రోజుల పాటు దేవరకొండ ఖిల్లా ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పురావస్తు శాఖ సంచాలకుడు, బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ అండ్రూల్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రారంభించనున్నారు.
ఖిలా అభివృద్ధికి ప్రభుత్వం కృషి..
చారిత్రక ప్రాంతాలు, ప్రదేశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖిలాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే నిధులు వెచ్చించారు. సీసీ రోడ్లు, పార్కుల నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారికి సమీపంలో ఉండడంతో ఖిలా పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చెందుతుంది.
సకల హంగులతో పార్కు ఏర్పాటు…
ఖిలా ప్రాంగణంలో సకల హంగులతో పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.5కోట్లతో పార్కు అభివృద్ధి పనులు మొదలయ్యాయి. పిల్లలు మొదలుకుని పెద్దల వరకు అందరినీ ఆహ్లాదపర్చేలా అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. 5ఎకరాల విశాల ప్రదేశంలో పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను పెంచనున్నారు. లైబ్రరీ, ఓపెన్ ఆడిటోరియం, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను సైతం అందుబాటులోకి తెస్తున్నారు. ఫౌంటెయిన్తోపాటు సేద తీరేందుకు గ్రీన్ కార్పెట్ గడ్డిని ఏర్పాటు చేయనున్నారు. పార్కుకు వచ్చేవారి భద్రత దృష్ట్యా చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు.