
ఆలేరు టౌన్, డిసెంబర్ 23 : క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా తీర్చి దిద్దారు. నేటి రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైస్తవులు తమ ఇంటిపై నక్షత్రం ఆకారంలో ఉన్న విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లో క్రిస్మస్ సామగ్రి విక్రయించేందుకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. బట్టలు, సామగ్రి దుకాణాల్లో కొనుగోలు దారుల సందడి నెలకొంది.
చారిత్రక గుండ్లగూడెం చర్చి
ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలోని వెస్లీ చర్చికి గొప్ప చరిత్ర ఉంది. 1891-1910 మధ్య (బ్రిటీష్ కాలంలో) నిర్మించినది. 1899లో ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైన అనంతరం చర్చిగా మార్చారు. ఆంగ్లేయ అధికారులు చర్చి పాఠశాల, హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. హాస్టల్లో ఉండి చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెదక్ శిల్పి సీఐ పాస్సోనెట్ గుండ్లగూడేనికి వచ్చి చర్చి డిజైన్‌ను రూపొందించారు. మెదక్ చర్చి కంటే ముందుగా గుండ్లగూడెంలో చర్చి నిర్మాణం ప్రారంభమైంది. మెథడిస్ట్ చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ ఆధీనంలో ఉన్న గుండ్లగూడెం చర్చి 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చర్చి ఆఫ్ సౌత్ ఇండియా ఆధీనంలోకి వెళ్లింది. తెలంగాణలోనే గొప్ప క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రంగా దీనికి పేరుంది. ఇప్పటి వరకు 50 మందికి పైగా పాస్టర్లు ఇక్కడ పని చేశారు. 2013లో దీనిని ఆధునీకరించారు. చర్చి ఆవరణలో విశాలమైన మైదానం ఉంది. ఇందులో బ్రిటీష్ కాలంలో సైనికులకు శిక్షణ ఇచ్చే వారని చెబుతారు.
నవంబర్ 24 నుంచే క్రిస్మస్ నెల
డిసెంబర్ 25వ తేదీన క్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ జరుపుకుంటారు. అయితే నవంబర్ 24 నుంచి డిసెంబర్ 24 వరకు క్రిస్మస్ నెలగా క్రైస్తవులు పరిగణిస్తారు. ఈ నెల రోజులు రాత్రి వేళల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. 24న రాత్రి జాగారం చేస్తూ మహాప్రార్థన చేస్తారు. 25న ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటారు.