సర్వ మతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చినట్టే.. క్రిస్మస్కు దుస్తులను పంపిణీ చేస్తూ వస్తున్నది. ఈసారి కూడా నిరుపేద క్రైస్తవులందరికీ గిఫ్ట్ ప్యాక్‌లు అందించాలని నిర్ణయించింది. జిల్లా అవసరాల మేరకు ఇప్పటికే 2వేల ప్యాక్‌లు రాగా, జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో భద్రపరిచారు. వాటిని మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల 18 నుంచి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమం సజావుగా సాగేందుకు ఆలేరు నియోజకవర్గానికి డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, భువనగిరికి ఆర్డీఓ భూపాల్‌రెడ్డిని ప్రత్యేకాధికారులుగానియమించారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని వర్గాలు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దసరా, రంజాన్ పండుగల సందర్భంగా కానుకలను అందిస్తున్నట్లుగానే క్రిస్మస్ పండుగకు సైతం ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తున్నది. ఈ మేరకు భువనగిరి నియోజకవర్గానికి వెయ్యి, ఆలేరు నియోజకవర్గానికి వెయ్యి గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయి. ప్రస్తుతానికి వీటిని జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో భద్రపర్చిన అధికారులు మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. నిరుపేద క్రైస్తవులకు ఈనెల 18 నుంచి రెండు, మూడ్రోజులపాటు సజావుగా పంపిణీ చేసేందుకుగాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక అధికారులను నియమించారు. భువనగిరి నియోజకవర్గానికి ఆర్డీఓ భూపాల్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గానికి డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డిని నియమించారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీల ఏర్పాటు
భువనగిరి, ఆలేరు నియోజకవర్గ పరిధిలో క్రిస్మస్ కానుకుల పంపిణీ కోసం ప్రతి మండలానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాస్టర్లతోపాటు అధికారులకు స్థానం కల్పించారు. నోడల్ అధికారిగా ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులుగా తాసీల్దార్లు వ్యవహరిస్తారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్‌లో చీర, ప్యాంట్, షర్ట్‌తోపాటు యువతుల కోసం డ్రెస్ మెటీరియల్ అందజేస్తారు. స్థానిక పాస్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులను పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి పకడ్బందీగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రతి యేటా ప్రభుత్వం తరఫున నిర్వహించే క్రిస్మస్ విందుకు ప్రభుత్వం నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నది. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్ విందు కార్యక్రమాన్ని గతంలో నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించగా.. ఈసారి జిల్లాలోని 17 మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం
ఎమ్మెల్యేల చేతుల మీదుగా క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసేందుకు జిల్లాలో అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అర్హులైన క్రైస్తవుల జాబితాను రూపొందించాం. మొత్తం రెండు వేల గిఫ్ట్ ప్యాక్‌లు అంది స్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ గిఫ్ట్ ప్యాక్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభు త్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే క్రిస్మస్ విందుకూ ఏర్పాట్లు చేస్తాం.
-కె.సత్యనారాయణ,
మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి