జూబ్లీహిల్స్ : కైస్తవుల ఖ్యాతిని ఇనుమడింపచేసేలా క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తెలిపారు. సోమవారం యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్‌లో చేపట్టనున్న ఏర్పాట్లను సెలబ్రేషన్ కమిటీతో పాటు స్థానిక కార్పొరేటర్ రాజకుమార్ పటేల్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఏ పండుగకైనా, ఏ వేడుకకైనా ప్రత్యేకతను చాటుకునే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నటు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు..
తెలంగాణ ప్రభుత్వం చర్చిలలో నిర్వహించే క్రిస్మస్ విందులు, క్రిస్మస్ కానుకల పంపిణీకి ముందే జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు. కైస్తవులు డిసెంబర్ 25 న జరుపుకునే క్రిస్మస్ పర్వదినం కంటే ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 182 చర్చిలతో యునైటెడ్ సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా డిసెంబర్ 11 న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న వేడుకలలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ 5 వేల మందికి క్రిస్మస్ కానుకలు పంచి, క్రిస్మస్ విందు ఇవ్వనున్నారని జూబ్లీహిల్స్ క్రిష్టియన్ ఫోరం వెల్లడించింది.
ఈ వేడుకలలో అంతర్జాతీయ వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ రాజ్ప్రకాశ్పాల్ క్రిస్మస్ సందేశాన్ని అందించనుండడంతో పాటు మన్నాగ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ సంగీత విభావరి నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఎమ్మెల్యేను సన్మానించిన క్రిష్టియన్ ఫోరం..
యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబర్ 11 న నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ను సెలబ్రేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కైస్తవుల పట్ల ప్రత్యేక ఆదరాభిమానాలు చూపుతూ క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనుండడంపై ఫోరం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా యునైటెడ్ క్రిష్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ను, కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ ను శాలువాలతో సత్కరించారు.