
ఖమ్మం, డిసెంబర్ 23: క్రిస్మస్.. క్రైస్తవుల పండుగల్లో అతి ముఖ్యమైనది. క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఈనెల 24న అర్ధరాత్రి నుంచే వేడుకలు జరుపుకునేందుకు జిల్లాలోని క్రైస్తవులంతా సన్నద్ధమయ్యారు. చర్చీలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వాడవాడలా క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో సందడి వాతావరణ నెలకొంది. క్రిస్మస్ నేపథ్యంలో వారం రోజులుగా వివిధ దుకాణాలు రద్దీగా ఉంటున్నాయి. నగరంలోని ప్రధాన వీధులు కిటకిటలాడుతున్నాయి. వస్త్ర దుకాణాలు, స్వీట్ షాపులు, కేక్‌ల తయారీ దుకాణాల వద్ద హడావిడి కనిపిస్తోంది.
మార్కెట్లో బిజీబిజీ..
శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాత మాస్కులు, కలర్ లైట్లు, బెలూన్లు, గంటలు, క్రిస్మస్ క్యాండిల్స్తోపాటు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసుందుకు క్రైస్తవ భక్తులు బారులు తీరుతుండడంతో మార్కెట్లు బిజీబిజీగా ఉంటున్నాయి. ఖమ్మంలోని కమాన్‌బజార్, కస్బాబజార్, స్టేషన్‌రోడ్డులోని ఫ్యాన్సీ షాపుల్లో క్రిస్మస్ ట్రీ, స్టార్స్, డెకరేషన్ మెటీరియల్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
క్రిస్మస్ ప్రత్యేక ఆకర్షణలు..
క్రిస్మస్ సందర్భంగా అందమైన ‘క్రిస్మస్ ట్రీ’ని తయారుచేస్తారు. సరుగుడు చెట్టు లేదా చెట్టుకొమ్మను తెచ్చి దానికి ఎర్రని ఆపిల్ పండ్లను, నీలి ఎరుపురంగు గుండ్రని బంతులను రంగురంగుల బెలూన్లతో, మెరుపు కాగితాలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. దీనినే క్రిస్మస్ ట్రీగా పిలుస్తారు. క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైనదని చెబుతుంటారు. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజభవనంలో ఒక క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొందిందని కొందరు అంటుంటారు. తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తును చూసేందుకు వస్తుండగా.. ఓ తార (నక్షత్రం) మార్గం చూపిందని, అందుకు గుర్తుగానే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్రాన్ని వేలాడదీస్తారని చెబుతుంటారు. అలాగే, మన దేశంలోని క్రిస్మస్ తాతనే పాశ్చాత్యదేశాల్లో శాంతాక్లాజ్‌గా పిలుస్తారు. క్రిస్మస్ తాత సంప్రదాయం మూడో శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చింది.
పశువుల పాకలో క్రీస్తు జననం..
తాను సామాన్య మానవుల కోసమే తాను లోకానికి వచ్చాననే సందేశాన్ని ఇవ్వడానికే క్రీస్తు పశువులపాకలో జన్మించాడన్నది క్రైస్తవుల విశ్వాసం. అందుకే ఆయన జన్మకు ప్రతీక అయిన పశువుల పాక సెట్టింగ్‌లను ఇళ్లల్లోనూ, చర్చీల్లోనూ ఉంచుతారు.