భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు 108 వాహనం తరహాలో బాలల కోసం బాలరక్షక్ అందుబాటులోకి వచ్చింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ బాలరక్షక్ వాహనం భద్రాద్రి జిల్లాకు మంజూరైంది. గతంలో పిల్లలపై వేధింపులు, బాల్యవివాహాలు వంటి అంశాలపై ఫిర్యాదులు వస్తే రెస్క్యూ టీం చేరుకోవడానికి కొంత సమయం పట్టేది. ఇకనుంచి అలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం బాలరక్షక్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బాధితుల సమస్యలు వేగంగా పరిష్కారం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా అక్కడకు చేరుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడనుంది. ఐసీపీఎస్, చైల్డ్‌లైన్, ఐసీడీఎస్, బాలల రక్షణ కోసం పనిచేసే సిబ్బంది రెస్క్యూ టీంలో ఉండి వారికి అండగా ఉంటారు. జిల్లాకు మంజూరైన బాలరక్షక్ వాహనాన్ని కలెక్టర్ అనుదీప్ ఇటీవల ప్రారంభించిన విషయం విదితమే.
ఫిర్యాదు వస్తే క్షణాల్లో రెస్క్యూ టీం..
బాలల రక్షణ కోసం ఎవరు ఫిర్యాదు చేసినా క్షణాల్లో అక్కడకు చేరుకునేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. భద్రాద్రి జిల్లాలోని ఏ గ్రామంలో ఎక్కడ సమస్య వచ్చినా బాలల రక్షణ కమిటీల బాధ్యులు, ఐసీడీఎస్ ఉద్యోగులు ఈ వాహనం ద్వారా సంఘటనా స్థలానికి చేరుకుంటారు. 1098 నెంబర్‌కు కాల్ చేసినా ఈ వాహనం అందుబాటులోకి రానున్నది.
వేధింపులు, బాల్యవివాహాలపై సత్వర స్పందన..
అప్పుడే పుట్టిన బిడ్డలను చాలామంది ముళ్ల పొదల్లో వదిలి వెళ్తుంటారు. ఇలాంటి సమాచారం అందినప్పుడు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర వాహనాల్లో వెళ్లేలోగానే ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో ఒక్కోసారి పసిబిడ్డలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇకనుంచి అలాంటి పసికందులను ఆదుకునేకుందుకు ఈ బాలరక్షక్ వాహనం అండగా ఉండనుంది. వేధింపుల ఘటనలు జరిగిన తర్వాత సంబంధిత అధికారులు అక్కడికి చేరుకోవడం ఆలస్యమవుతుండడంతో కొన్ని కేసులు పోలీస్‌స్టేషన్ దాకా రావడం లేదు. ఇలాంటి ఘటనలు, కేసుల్లో కూడా బాలరక్షక్ సహాయపడనుంది.
24 గంటలూ అందుబాటులో ఉంటుంది..
సమస్య ఏదైనా బాలల కోసం అండగా ఉండడమే మా శాఖ లక్ష్యం. అందుకే పెద్ద వాళ్లకోసం సఖి కేంద్రంలో ఒక వాహనం అందుబాటులో ఉంది. ఇప్పుడు బాలల కోసం బాలరక్షక్ వాహనాన్ని అందుబాటులో ఉంచాం. ఏదైనా ప్రమాదంలో ఉండి ఎవరైనా ఫోన్ చేస్తే.. వెంటనే ఈ వాహనం అక్కడకు చేరుకుంటుంది. 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఐసీపీఎస్, చైల్డ్‌లైన్ సిబ్బంది సైతం నిత్యం అందుబాటులో ఉంటారు.
-ఆర్.వరలక్ష్మి, డీడబ్ల్యూవో, కొత్తగూడెం