పుట్టగానే తల్లి ప్రేమకు దూరమైన పిల్లలు కొందరు.. కన్నవారు దూరమై అనాథలుగా మారుతున్న వారు మరికొందరు.. అమ్మానాన్న మందలించారని ఇండ్ల నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్న వారు ఇంకొందరు.. ఇలాంటి అభాగ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తున్నది. బడికి వెళ్లాల్సిన ప్రాయంలో పనుల్లో మగ్గిపోతున్న చిన్నారుల కోసం సర్కారు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. తాజాగా సఖి కేంద్రం తరహాలో నిరంతరాయంగా సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది.
యాదాద్రి భువనగిరి, జనవరి 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 వరకు బాలల సంరక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 16, సూర్యాపేట జిల్లాలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 వరకు ఈ కేంద్రాలు కొనసాగుతుండగా వీటిలో 450 మంది వరకు బాల బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. జిల్లాల వారీగా ఏర్పాటైన బాలల పరిరక్షణ కమిటీలు సంరక్షణ సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. బాల్య వివాహాలు, లైగింక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతున్న గ్రామాలను గుర్తించి బాలల హక్కులపై ఈ కమిటీలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో అనాథలు, విధివంచితులైన పిల్లలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో బాలరక్ష భవన్‌ను ఏర్పాటు చేసింది. వారికోసం బాలరక్షక్ వాహనాలను సైతం అందుబాటులోకి తెచ్చింది. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు బాలరక్షక్ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం జిల్లా కొకటి చొప్పున ఏర్పాటయ్యాయి. బాల్య వివాహాలు, లైగింక వేధింపుల బాధితులు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, దివ్యాంగులు, చెత్తకుప్పల్లో దొరికినవారు, బాల కార్మికులు, బాల యాచకులు, తప్పిపోయిన వారికి బాలరక్షా భవన్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు వారికి ఆహార వసతి ఏర్పాట్లు సైతం చేయనున్నారు. ఈ భవన్లో కేవలం పిల్లల సంరక్షణే కాకుండా బాల నేరస్తులకు శిక్షలు విధించే ‘జువైనల్ కోర్టు’ గది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గది, జిల్లా పరిశీలన అధికారి(డీపీఓ), స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్, ఛైల్డ్ లేబర్ ప్రొటెక్ట్, శిశు గృహం, 1098 హెల్ప్‌లైన్ కార్యాలయం తదితర అన్నిరకాల సేవలకు సంబంధించి ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
‘బాల రక్షక్’ ప్రత్యేకతలివి..
పిల్లల హక్కులను పరిరక్షించడంతోపాటు అనాథ పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. వారికి సంరక్షణ కల్పించేలా చర్యలు ఏర్పాటు చేస్తున్నది.
0-18 ఏళ్ల బాలలకు ఆపద వస్తే వెంటనే 1098 నంబరును సంప్రదించి బాలరక్షక్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. దీంతో సిబ్బంది వెంటనే వాహనంలో రెస్క్యూ సిబ్బందితో కలిసి వచ్చి బాధితులకు రక్షణ కల్పిస్తారు. తాత్కాలికంగా బాలరక్షా భవన్‌కు తరలించి ఉచితంగా వసతి కల్పించడంతోపాటు భోజన సదుపాయం కల్పిస్తారు.
సమగ్ర బాలల పరిరక్షణ పథకం(ఐసీపీఎస్) కింద జిల్లా బాలల పరిరక్షణ విభాగం పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా బాలల సంక్షేమ సమితి(సీడబ్ల్యూసీ), బాలల న్యాయ మండలి(జేజేబీ), ప్రత్యేక బాలల పోలీస్ విభాగం, చైల్డ్‌లైన్(1098), జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్(డీపీఓ), జాతీయ బాలకార్మికుల ప్రాజెక్టు(ఎన్సీఎల్పీ) కమిటీలు వాహనంలో అందుబాటులో ఉంటాయి.
బాలల సాధికారతకు దోహదం
బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా వారి సాధికారతకు బాల రక్షా భవన్ దోహదపడనుంది. అభాగ్యులైన పిల్లలకు అత్యవసర సేవలతోపాటు, దీర్ఘకాలిక పునరావాస సేవలన్నీ ఒకే చోట అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. బాలరక్షక్ వాహనం అందుబాటులోకి రావడంతో నిరంతరాయంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
పులుగుజ్జు సైదులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా
మరింత చేరువ కానున్న సేవలు
బాలరక్షక్తో బాలలకు అందించే రక్షణ, పరిరక్షణ సేవలు మరింత చేరువయ్యాయి. హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారి వద్దకు సైతం అధికారులే వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుంటారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారు.
-కేవీ కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా