బాన్సువాడ/బీర్కూర్/ నస్రుల్లాబాద్, డిసెంబర్ 31: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్రం ఆలోచనా తీరును మార్చుకోవాలన్నారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రూ.6కోట్లతో చేపట్టనున్న మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల భవనం, రూ. 20 లక్షలతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో రూ.9.33 కోట్లతో నిర్మించిన 13.400 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తోందన్నారు. రైతన్న పండిస్తేనే దేశంలోని ప్రతి ఒక్కరికీ అన్నం దొరుకుతున్నదన్నారు. వస్తువులు, దుస్తుల మాదిరిగా ఆహారం మిషన్‌లో తయారుచేసేది కాదన్న విషయం కేంద్రం గమనించాలని సూచించారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్య త కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉందన్నారు. పాలకులు రాజకీయాలను పక్కనబెట్టి రైతులు, ప్రజలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మన రా్రష్ట్రంలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నదని తెలిపారు. వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆరుగురు మంత్రులతో కూడిన బృందం వారం పాటు ఢిల్లీకి వెళ్లి అడిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వాలు బాగుంటాయన్నారు. తల్లిదండ్రులు కన్న కలలను పిల్లలు ఉన్నత చదువులు చదివి సాకారం చేయాలని సూచించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆహారం,వసతి సౌకర్యాలను ఒకేచోట కల్పించడమే గురుకులాల ఏర్పాటు ఉద్దేశమన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరికీ బ్రహ్మాస్త్రం వంటిదన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. 70 ఏండ్లలో కేవలం 19 గురుకులాలు ఉంటే, ఏడేండ్లలో 281 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మైలారం గ్రామంలో గోదాముల నిర్మాణానికి స్థల సేకరణకు ప్రత్యేక చొరవ తీసుకున్న మైలారం విండో చైర్మన్ పెర్క శ్రీనివాస్‌ను స్పీకర్ పోచారం అభినందించారు.
సోలార్‌ప్లాంట్ల ఏర్పాటుకు కృషి: మంత్రి గంగుల కమలాకర్
గురుకుల విద్యార్థులు చదువుల్లో రాణించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 281 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా 25 వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నదని అన్నారు. చలికాలం నేపథ్యంలో వసతి గృహాల్లో వేడినీళ్ల కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ సహకారంతో ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో గుడుల నిర్మాణం కన్నా అతిముఖ్యమైనవి బడులేనని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అన్నారు. పేద వర్గాల ప్రజల పిల్లలకు కావాల్సింది గుడుల కన్నా ముందుగా బడులేనని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ప్రయోజకులు కావాలన్నారు. అనంతరం ఆయన పాడిన పాట అందరినీ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌నాయక్, ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఉప సర్పంచ్ షాహిన్ బేగం, ఏఎంసీ చైర్మన్లు ద్రోణవల్లి అశోక్, పాత బాలకృష్ణ, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, ఎంపీటీసీ సందీప్ పటేల్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, నాయకులు పాల్గొన్నారు.