
వైరా, డిసెంబర్ 20: యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ‘ఊరూరా చావు డప్పు’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరాలో జరిగిన నిరసనలో ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపైనా, తెలంగాణ రైతులపైనా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు. రాష్ట్ర రైతుల ధాన్యం కొనకుండా వారిని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు రాజకీయంగా దెబ్బతీసేందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాలయాపపన చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కేంద్రం ధాన్యం కొనేంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమానికి పిలిపించినా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం ఉండాలని పిలుపునిచ్చారు. మార్క్‌ఫైడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, వైరా పట్టణ అధ్యక్షుడు ధార్నా రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు పసుపులేటి మోహన్‌రావు, కొణిజర్ల జడ్పీటీసీ పోట్ల కవిత, మండల అధ్యక్షుడు యండ్రాప్రగడ మాధవరావు, నాయకులు పోట్ల శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.