జమ్మికుంట, డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం చే‘నేత’పై కక్షగట్టిందని, వస్త్ర పరిశ్రమకు జీఎస్టీ పెంపు సరికాదని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని చేనేత సహకార సంఘాల నాయకులు అరుకాల వీరేశలింగం, అడిగొప్పుల సత్యనారాయణ, ఉడుత రమేశ్, పొరండ్ల కృష్ణప్రసాద్, ఎలిగేటి ఉపేందర్, శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ పరిధిలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్మికుల ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నేతన్నలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చేనేత సహకార సంఘాల నాయకులు మాట్లాడుతూ, చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు చేనేతను కుటీర పరిశ్రమగా గుర్తించాయని, సంక్షేమ పథకాలతో ప్రోత్సహించాయని గుర్తు చేశారు. చేనేత రంగం ద్వారా ఆనేక మంది ఉపాధి పొందుతున్నారని, చేయూతనివ్వాల్సింది పోయి పన్ను విధించడమేంటని ప్రశ్నించారు. జీఎస్టీ పెంపుతో చేనేత పరిశ్రమలు మూతపడి, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. కేంద్రం మొండి వైఖరి వీడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించాలని కోరారు. కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయకుంటే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కాగా, దీక్షకు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు మద్దతు ప్రకటించారు. అనంతరం నాయకులకు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. దీక్షలో చేనేత సహకార సంఘాల నాయకులు సర్వేశం, ఉపేందర్, తిరుపతి, రామచంద్రం, అజయ్, పరదేశి, శంకరయ్య, చక్రపాణి, దామోదర్, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.