పై ఫొటోలో ఉన్న మహిళా రైతు పేరు సిరివేణి పుష్ప. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఒడ్డాపల్లి గ్రామం. ఈమెకు మొత్తం ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దీంతో రైతుబంధు పథకం కింద సీజన్‌కు రూ.40వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. పెట్టుబడికి కేసీఆర్ సర్కారు అందిస్తున్న సాయంతో పొలంలో ఉన్న బాయిని పూడ్చి వేయించారు. ఎరువులు, విత్తనాలతోపాటు దుక్కి దున్నడం, దమ్ము చేయడం వంటి పనులకు రైతుబంధు డబ్బులు ఉపయోగపడ్డాయి. మిగిలిన డబ్బులతో ఈమధ్య బీరపాదులు, దొండపాదులకు సిమెంట్ స్తంభాలు వేయించారు. ఇలా వ్యవసాయ అనుబంధ పనులకూ రైతుబంధు డబ్బులు వినియోగించుకుంటున్నారు.‘సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో మేము వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధ తప్పింది. సుమారు 20ఏండ్లుగా మాకున్న సాగు భూముల్లో కనీసం రెండు ఎకరాలు కూరగాయలు సాగు చేస్తూ మిగతా భూమిలో వరి పండిస్తున్నాం. గతంలో సాగు పనులు ప్రారంభించాలంటే దళారులను ఆశ్రయించి వారితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సు డబ్బులు తీసుకునేవాళ్లం. పంట చేతికొచ్చాక ధాన్యం విక్రయిస్తే సదరు దళారులు ఇచ్చిన వడ్డీతో కలిపి అడ్వాన్సు డబ్బులు తీసుకుని మిగతావి మా చేతికిచ్చేవారు. అయితే, ధాన్యం రేటు కూడా ముందుగానే నిర్ణయించే వారు. దీంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు రైతుబంధు డబ్బులు వస్తుండడంతో అన్ని రకాల ఇబ్బందులు తీరాయి. మాకున్న ఎనిమిదెకరాల భూమికి వస్తున్న డబ్బులతో పెట్టుబడి సాయానికి ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం మెంతికూర, వంకాయ నారు, పుంటికూరతోపాటు బీరపాదులు, దొండపాదులు వేశాం. మరోవారం రోజుల్లో దొండకాయలు చేతికివస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా అందిస్తున్న సాయం ఎనలేనిదిగా మారింది’ అని సంతోషం వ్యక్తం చేస్తున్నది. -శక్కర్‌నగర్, జనవరి 3