ఉమ్మడి రాష్ట్రంలో అమలైన లోపభూయిష్ట జోనల్ వ్యవస్థ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు సృష్టించడం ద్వారా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 2018లో రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నూతన జోనల్ విధానం ప్రాతిపదికన ఉద్యోగుల విభజన ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మతించిన తర్వాతే ప్రభుత్వం జీవో నంబర్ 317ను విడుదల చేసి, దాన్ని అనుసరించి బదిలీల ప్రక్రియను చేపడుతున్నది. అయితే ఒకరిద్దరి అసౌకర్యాన్ని వివాదం చేసి, రాజకీయంగా వాడుకోవాలనుకునే శక్తుల వల్ల అంతిమంగా మెజారిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నష్టపోతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్, జనవరి 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్తోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగింది. అలుపెరగని పోరాటం ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఏడేండ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడు కేసీఆరే ఉండడంతో ప్రజలందరికీ సమన్యాయంతో పరిపాలన సాగిస్తున్నారు. సమైక్య పాలకులను ఎదురించి పోరాడడంలో పాలుపంచుకున్న ఉపాధ్యాయ, ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూస్తున్నారు. సమయానికి పీఆర్సీని పెంచుతూ… ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ సమకూరుస్తున్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల్లో ఎదురవుతున్న స్థానికత సమస్యకు శాస్వత పరిష్కారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన జోనల్ వ్యవస్థ స్థానంలో మేధోమథనం చేసి ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేసి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పాటుపడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జోనల్ వ్యవస్థకు 2018లో రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ ఆమోదముద్ర వేయడంతో తదనుగుణంగానే విభజన ప్రక్రియకు ప్రభుత్వం పూనుకున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత వెల్లడైన అంశాలతో ప్రభుత్వం జీవో నంబర్ 317ను జారీ చేసింది. ఈ జీవోను అనుసరించి బదిలీలు చేపడుతున్నది.
కొత్త జోనల్ వ్యవస్థతో ఎంతో మేలు
వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా పాత జోనల్ వ్యవస్థ అమలు తీరు అస్తవ్యస్తంగా ఉండేది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వచ్చిన వారంతా ఉద్యోగాలు చేసేవారు. ప్రస్తుతం నూతన జోనల్ వ్యవస్థ ద్వారా ఎక్కడి వారికి అక్కడే ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పుడు రాజన్న, బాసర జోన్లుగా వేరుపడింది. దీంతో ఆయా జోన్లలో నాలుగైదు జిల్లాలను చేర్చారు. అక్కడ ఏర్పడే ఖాళీ పోస్టులకు స్థానిక యువతకే ఉద్యోగ నియామకాల్లో 95శాతం అవకాశం లభించనున్నది. ఇంతకు ముందు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా స్థానికుల ఉద్యోగాలను కొల్లగొట్టే పద్ధతి ఉండేది. ఇప్పుడు అలాంటి అశాస్త్రీయమైన విధానానికి సర్కారు స్వస్తి పలికింది. తద్వారా ఉద్యోగ నియామకాల్లో సమ న్యాయం అన్నది పక్కాగా కనిపించబోతోంది. భవిష్యత్తులో భారీగా నియామకాలు చేపట్టాలన్నా ఇప్పుడు ఏర్పడిన నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగులను సర్దుబాటు చేయడం తప్పనిసరి. ఆయా జిల్లాలకు కేడర్ స్ట్రెంగ్త్ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులను పంపించిన తర్వాత వెలుగు చూసే ఖాళీ పోస్టుల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
పక్కాగా జీవో నంబర్ 317
నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియలో కొంత మందికి మాత్రమే నష్టం కలుగుతుంది. మొత్తం పోస్టుల్లో అవసరం మేరకు ఆయా జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపులు జరిగిన తర్వాత మిగిలిన వారిని ఖాళీలను అనుసరించి ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేస్తున్నారు. తద్వారా ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి ఇబ్బందులు కలుగుతుండడం వాస్తవమే. 317 జీవోలో వెల్లడైన మార్గదర్శకాలు అన్ని కూడా ఆయా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కచ్చితమైన, పారదర్శకమైన విధానానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల విభజన ద్వారా కొంత మంది జూనియర్లకు స్థానికత అన్నది కోల్పోయే పరిస్థితి ఏర్పడితే.. వారికి భవిష్యత్తులో ఏర్పడే ఖాళీల్లో అవకాశం ఇచ్చేందుకు సర్కారు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులంతా ఇప్పటికే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం.
బండి… తొండి రాజకీయం
భారతీయ జనతా పార్టీకి ప్రజా ప్రయోజనం అన్నది మచ్చుకూ లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందిన నాయకులకు బాధ్యతతో పాటుగా నైతికత అన్నది ముఖ్యం. కానీ తెలంగాణ రాష్ర్టానికి వచ్చే సరికి ప్రతి అంశానికీ రాజకీయ రంగునద్ది చిన్న సమస్యను పెద్దగా చూపించే ప్రయత్నానికి ఒడిగడుతుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధం లేని అంశాలను తెర మీదికి తీసుకువచ్చి రాద్ధాంతం చేయడంలో బీజేపీ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ర్టాలకు అందిస్తున్న సహకారాన్ని వదిలేసి స్థానిక కమలం పార్టీ నేతలు కావాలని ఆయా వర్గాలను రెచ్చగొట్టేందుకు పన్నాగం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షల పేరుతో డ్రామాలకు తెర లేపడంపై ప్రజలంతా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రజలపై అంతగా ప్రేమ ఉంటే వడ్ల సేకరణపై మొండికేస్తున్న కేంద్ర సర్కారు తీరుపై నిరసనలు తెలుపాలంటూ హితవు పలుకుతున్నారు.
భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది
జీవో 317 ప్రకారం కొంత మందికి ఇబ్బంది కలిగింది నిజమే. జిల్లాల పునర్విభజన వల్ల సీనియారిటి, స్థానికత వల్ల కొంతమందికి స్థానచలనం తప్పదు. విభజన ప్రక్రియ అన్నది కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం కచ్చితంగా జరగాల్సింది. భవిష్యత్తులో పదోన్నతులు రావాలన్నా, బదిలీలు జరగాలన్నా కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన అనివార్యం.
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు విభజన
2018 రాష్ట్రపతి ఆదేశాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో జారీ చేసింది. జిల్లాల విభజన జరుగకపోతే ప్రమోషన్లు ఉండవు. బదిలీలు ఉండవు. నియామకాలు ఉండవు. రాష్ట్రపతి ఆర్డర్ ప్రకారం విభజన చేపడుతున్నారు. ఇందులో స్థానికతకు బదులుగా సీనియారిటీ అన్నది ఉండటం మూలంగా జూనియర్లకు ఇబ్బంది కలిగింది. ఎవరైతే ఇప్పుడు నష్టపోయారో వారికి సర్వీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ… భవిష్యత్తులో వారి సొంత జిల్లాలకు తీసుకు రావాలి. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలి.