మణుగూరు రూరల్, జనవరి 9 : మణుగూరు మండలంలోని చిక్కుడుగుంట గ్రామం, పినపాక మండల సరిహద్దులో 1080(4×270) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్(భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్)లో ఆదివారం ఉదయం 8:37 నిమిషాలకు సీఓడీ(కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలను టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు జెన్కో అధికారులకు అందజేసినట్లు జెన్కో డైరెక్టర్(ప్రాజెక్ట్) ఎం.సచ్చిదానందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఈటీపీసీ ఆపరేషన్స్ పీవీ.శ్రీనివాస్‌తో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2015 మార్చిలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్‌లో మూడు యూనిట్ల కమర్షియల్ ఆపరేషన్ పూర్తయిందని, ఆదివారం నుంచి నాల్గో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ ప్రారంభమైందన్నారు. ఈ నాలుగు యూనిట్ల ద్వారా రోజూ సగటున 25 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందన్నారు. తద్వారా ఏడాదిలో రాష్ట్ర అవసరాలకు వినియోగించే విద్యుత్‌లో 8-10శాతం బీటీపీఎస్ నుంచి అందించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఏర్పడబోతున్న విద్యుత్ కొరతను తీర్చేందుకు బీటీపీఎస్‌లో నాల్గో యూనిట్ కూడా అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ త్వరితగతిన పూర్తిచేసేందుకు నిరంతరం శ్రమించిన బీటీపీఎస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు.
అనుకున్న సమయానికి ముందే….
నాల్గో యూనిట్ లైటప్ గతేడాది ఏప్రిల్ 16న జరగ్గా, సింక్రనైజేషన్ అక్టోబర్ 14న పూర్తయిందని తెలిపారు. సింక్రనైజేషన్ పూర్తయి సీఓడీ కావడానికి కనీసం ఆరునెలల సమయం పట్టాల్సి ఉండగా, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రత్యేక ప్రణాళిక, సూచనలు, జరుగుతున్న ప్లాంట్ పనులపై సమీక్షలు నిర్వహించడం, 20గంటల పాటు నిరంతరం ఇంజినీర్లు శ్రమించడం వల్ల మూడు నెలల్లోనే పూర్తి చేయగలిగామని హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన సీఈ బాలరాజు, ఇంజినీర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అగ్రిమెంట్ పత్రాలపై టీఎస్ ఎన్పీడీసీఎల్ సీజేఎం మధుసూదన్‌రావు, ఎస్పీడీసీఎల్ సీజేఎం కృష్ణయ్య, సీఈ బాలరాజు సంతకాలు చేశారు. కార్యక్రమంలో జెన్కో సీఈ(కోల్ అండ్ కమర్షియల్) టీఎస్ఎన్ మూర్తి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
నాల్గో యూనిట్ సీఓడీ పూర్తి హర్షణీయం
మణుగూరు ప్రాంతంలో బీటీపీఎస్ ఏర్పాటు ఇక్కడి ప్రజల అదృష్టం. ఎన్నికల హామీలో లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బీటీపీఎస్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అడ్డంకులు, అవరోధాలను అధిగమిస్తూ చివరి దశ నాల్గో యూనిట్ సీఓడీని పూర్తి చేయడం హర్షణీయం. టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, బీటీపీఎస్ సీఈ బాలరాజు, ఇంజినీరింగ్ విభాగానికి అభినందనలు.
-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు