భద్రాచలం/ పర్ణశాల, జనవరి 7: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం భద్రగిరీశుడు వామనావతారంలో దర్శనమిచ్చారు. వామనావతారంలో ఉన్న రామచంద్రుణ్ని చూసి భక్తులు తరించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఆండాళ్ అమ్మవారికి పాశురాలను విన్నవించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నివారణలో భాగంగా అమ్మవారికి, స్వామివారికి తిరువీధి సేవలు నిలిపివేశారు. అనంతరం అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి నిత్యకల్యాణమూర్తులను వామనావతారంలో అలంకరించారు. భక్తుల దర్శనార్థం బేడా మండపంలోనే ఉంచారు. సాయంత్రం స్వామివారికి దర్బారు సేవ, దివిటీ సలాం, నక్షత్ర హారతి, బంతులాట, వేద స్వస్తి నిర్వహించారు. ఆ తదుపరి ఆస్థాన హరిదాసులు తూము నర్సింహదాసు, భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు.
పరశురాముడి గాథ ఇదీ..
భద్రాద్రి రామయ్య శనివారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక సంరక్షణార్థం శ్రీహరి జమదగ్ని అనే మహర్షికి కుమారుడిగా జన్మిస్తాడు. పరశురాముడిగా పిలువబడుతూ దుష్టుడైన కార్తవీర్యార్జునుణ్ని, దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్కసారి దండెత్తి సంహరించాడు. పరశురామావతారంలో ధర్మాన్ని స్థాపించాడన్నది పండిత వాక్కు.
రామాలయంలో పరోక్ష సేవలు
భద్రాచలం, జనవరి 7: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పరోక్ష సేవలు జరిపేందుకు నిర్ణయించినట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైభవంగా నిర్వహిం చాల్సిన ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలను ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొద్దిమంది అర్చకులు, వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగానే నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న తెప్పోత్సవం, 13న ఉత్తరద్వార దర్శనం కూడా ఆలయ ప్రాంగణంలోనే జరుపుతారు. 13న వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల గోత్రనామాలతో శ్రీస్వామివారి అర్చన చేయించుకునే వారికి వాటిని పరోక్షంగా జరిపించుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.2 వేల టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి పరోక్షంగా వారి గోత్ర నామాలతో అర్చన చేయిస్తారు.
స్వామివారి మూలవరుల శాలువా, జాకెట్ పీసు, కుంకుమ, తలంబ్రాలు, మిస్రీ ప్రసాదం వంటి వాటిని పోస్టు/ కొరియర్ ద్వారా పంపిస్తారు. అలాగే రూ.వెయ్యి టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు పరోక్షంగా వారి గోత్ర నామాలతో అర్చన చేస్తారు. స్వామివారి కల్యాణ కండువా, జాకెట్ పీసు, కుంకుమ, తలంబ్రాలు, మిస్రీ ప్రసాదం వంటి వాటిని పోస్టల్/ కొరియర్ ద్వారా పంపిస్తారు.