మాక్లూర్(ఆర్మూర్), డిసెంబర్ 31: పట్టణంలోని బల్దియా కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. సమావేశంలో 28 అంశాలకు సంబంధించి కోటీ 72 లక్షల నిధులతో చేపట్టే పనులకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. పట్టణంలో వార్డుకు ఒక జిమ్ చొప్పున ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సభ్యుల కోరిక మేరకు సిద్ధులగుట్టపై, గుట్ట దిగువన ఉన్న వారికి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. నిజాంసాగర్ కాలువ బౌండ్రీ ఆక్రమణకు గురవుతున్నదని, పనులను నిలిపివేయించి ప్రభుత్వ స్థలాన్ని కా పాడాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు. బల్దియాలో ఖాళీ గా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. గూండ్ల చెరువు అభివృద్ధి కోసం రూ.రెండు కోట్లు మం జూరయ్యాయని, పనులను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మె ల్యే తెలిపారు. ఆర్మూర్ దవాఖానకు 109 పోస్టులు మంజూరయ్యాయని, వైద్య సేవలు మరింత మెరుగు పడుతాయని చెప్పారు. బల్దియా వైస్‌చైర్మన్ షేక్ మున్నా, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈ భూమేశ్వర్, కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, తాటి హన్మాండ్లు, ఖాందేశ్ సంగీతా శ్రీనివాస్, బండారి శాల ప్రసాద్, ఆకుల రాము, సుజాతా రమేశ్, పొద్దుటూరి మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘాట్ రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలి..
ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై కొనసాగుతున్న ఘాట్‌రోడ్డు పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఘాట్‌రోడ్డుపై కలియ తిరుగుతూ అభివృద్ధిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తంచేశారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. పనులను పర్యవేక్షించాలని నాయకులకు సూచించారు. ఆయన వెంట పలువురు నాయకులు, పట్టణ కౌన్సిలర్లు ఉన్నారు.
సహస్రార్జున మందిర నిర్మాణ పనులు ప్రారంభం..
పట్టణంలోని సిద్ధులగుట్టపై క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సహస్రార్జున మందిర పనులను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం కోసం సమాజ్ అధ్యక్షుడు పడాల్ గణేశ్, కార్యదర్శి బారడ్ గంగామోహన్, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, ఆలయ కమిటీ చైర్మన్ డీకే రాజేశ్ చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సమాజ్ బాధ్యులు పాల్గొన్నారు.