‘నేను 50 ఏండ్లకు అచ్చిన. నేను చిన్నగున్నప్పటి సంది ఎన్నో గవుర్నమెంట్లు సూసిన. కానీ రైతుల కోసం గింత ఆలోచన జేసే ముఖ్యమంత్రిని సూడలే..’ అంటున్న ఈ రైతు పి.శ్రీనివాస్‌రెడ్డి. బాన్సువాడ మండలం కొల్లూర్ వాసి. తనకున్న మూడెకరాల పొలంపై ఎనిమిదిసార్లు రైతుబంధు సాయం అందుకున్నడు. ‘50ఏండ్లల్ల ఎన్నో ప్రభుత్వాలు చూసిన. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కరెంటు ఇచ్చిండ్రు. అఖరికి కరెంటు డబ్బాలు కూడా పీక్కపోయిండ్రు. కేసీఆర్ గవుర్నమెంటు వచ్చినంక 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకున్నడు. తరువాత రైతుబంధు పెట్టి, తొలి ఏడాది ఎకరానికి 4వేలు ఇచ్చిండు. తర్వాత బంద్జేస్తరని చాలామంది భయపెట్టిండ్రు. కానీ సారు 5వేలకు పెంచి వానకాలం, యాసంగి పంటలు వేసుకునే యాళ్లకు పైసలు ఖాతాల యేస్తున్నరు..’అని శ్రీనివాసరెడ్డి మురిసిపోతున్నడు.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు డబ్బులు మూడు రోజుల నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1,96,265 మంది రైతుల ఖాతాల్లో రూ.130,73,49,020
రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది.
-ఖలీల్‌వాడి, డిసెంబర్ 30
80 ఏండ్ల నుంచి ఏ సర్కారోళ్లు గిట్ల డబ్బులు ఇయ్యలే..
బిచ్కుంద, డిసెంబర్ 30 : 80 ఏండ్ల నుంచి ఏ సర్కారోళ్లు గిట్ల పంట పెట్టుబడి కోసం పైసలు ఇయ్యలేదని బిచ్కుంద మండలం మిషన్కల్లాలి గ్రామానికి చెందిన రైతు గంగారాం అన్నారు. బిచ్కుంద ఎస్బీఐ బ్యాంకులో తనకు ఉన్న రెండు ఎకరాల పొలానికి సంబంధించిన రూ.10,000 రైతుబంధు డబ్బులను గురువారం డ్రా చేసుకున్న అనంతరం ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు 80 ఏండ్లు నిండాయని.. ఏనాడు రైతుకు పంటలు సాగు చేయడానికి పంట పెట్టుబడి కింద ఏ సర్కారోళ్లు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని తెలిపాడు. గతంలో షావుకారి దగ్గర రూ. 3 మిత్తితో అప్పు తీసుకువచ్చి పంట సాగు చేసేవాళ్లమని వివరించాడు. పంట చేతికి వచ్చిన తర్వాత విక్రయించగా షావుకారి బాకీపోనూ చేతిలో అంతంత మాత్రమే మిగిలేదని తెలిపాడు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం అందించడంతో అప్పులు చేసే పరిస్థితి లేకపోవడంతో డబ్బులు మిగులుతున్నాయన్నారు. తనకు ఉన్న రెండు ఎకరాల పొలంలో సోయా పండించానని.. పంట విక్రయించగా రూ.40,000 చొప్పున మిగులుతున్నాయని తెలిపాడు. పెట్టుబడి కింద సంవత్సరానికి రెండు సార్లు డబ్బులు జమ అవుతుండడంతో అప్పులు చేసే బాధ లేకుండాపోయిందని.. మిగిలిన డబ్బులు దాచుకోగా అవి మనుమరాలి పెండ్లికి ఉపయోగపడ్డాయని సంతోషం వ్యక్తం చేశాడు.
పెట్టుబడి కష్టాల నుంచి గట్టెక్కిన..
బోధన్, డిసెంబర్ 30: ఈ రైతు పేరు సంధాని. బోధన్ మండలం మీనార్‌పల్లి గ్రామం. తన కుటుంబానికి ఉన్న ఐదెకరాల 31 గుంటల భూమిలో ఏండ్లుగా పంట సాగు చేస్తున్నాడు. సాగుకు అవసరమయ్యే పెట్టుబడులకు డబ్బు దొరికేది కాదు.. ఒకవేళ దొరికినా.. అది కూడా అధిక వడ్డీలకు తెచ్చుకునేవాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందు సాగుకు నీళ్లు, కరెంట్ ఉండేది కాదు. దీంతో ఆరుగాలం కష్టపడడం, ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకువచ్చినా.. పంట చేతికి వస్తుందన్న ధీమా ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నాలుగేండ్లుగా ఇస్తున్న ‘రైతుబంధు’ సహాయం రైతు సంధానీని కష్టాల నుంచి గట్టెక్కించింది. ఇప్పుడు ఆ రైతుకు అప్పుల బాధలేదు. వానకాలం, యాసంగిలో సాగు పనులు ప్రారంభించేనాటికి రైతుబంధు పైసలు చేతికి వస్తున్నాయి. ప్రస్తుతం యాసంగికి సంబంధించిన రైతుబంధు సహాయాన్ని కూడా సంధాని బుధవారం తీసుకున్నాడు. సంధానికి సంగం గ్రామ శివారులోని సర్వే నంబర్ 102లో తన పేరిట 1.31ఎకరాలు, తన తల్లి మున్వరీబేగం పేరిట 4ఎకరాల సాగుభూ మి ఉన్నది. మొత్తం ఐదెకరాల 31 గుంటలకు సంబంధించిన రైతుబంధు సహాయాన్ని సంధాని అందుకుంటున్నాడు. ప్రస్తుత యాసంగికి రూ.28,200 పెట్టుబడి సహాయం కింద వచ్చాయి. మొదట్లో వచ్చిన రైతుబంధు డబ్బులతో ఇతరుల వద్ద అప్పుకోసం చేయిచాపడం మానేశాడు. ఇప్పుడు తన పొలం పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయమే సరిపోతున్నది. తనకున్న భూమిలో రెండు ఎకరాల్లో వరి, మిగతా మూడు ఎకరాల 31 గుంటల్లో పొద్దు తిరుగుడు, కుసుమ పంట సాగు చేస్తున్నాడు.
రెండు ఎకరాలను సాగులోకి తెచ్చిన..
సిరికొండ, డిసెంబర్ 30 : నాకు రెండు ఎకరాల పొలం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సాయం నాకు ఎంతో ఉపయోగపడింది. మొదటి మూడు విడుతల్లో వచ్చిన రైతుబంధు డబ్బులతో నాకున్న రెండు ఎకరాల బీడు భూమిలో పొదలు తొలగించడానికి ఉపయోగించాను. నాలుగు నుంచి ఆరు విడుతల్లో వచ్చిన డబ్బులతో ఎకరం బీడు భూమిని సాగు చేసి కంది పంటను సాగు చేయగా మంచి లాభం వచ్చింది. ఏడు, ఎనిమిది విడుతల్లో వచ్చిన డబ్బులతో పాటు కొంత డబ్బులను కలిపి నా కుటుంబానికి సరిపడా ధాన్యం కోసం సన్నరకం పంటను సాగు చేస్తున్నాను. రైతుబంధు పథకం డబ్బులతో బీడుగా ఉన్న భూమిని సాగులోకి తెచ్చాను.
-పెద్ద లింబాద్రి, తాళ్ల రామడుగు, సిరికొండ మండలం
కర్షకానందం
పంట పెట్టుబడి కోసం అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు, నాయకులు క్షీరాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ‘సీఎం కేసీఆర్ రైతుల పెట్టుబడి కోసం చేస్తున్న సహాయం నా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. ఇప్పుడు నేను సాగు ఖర్చుల కోసం ఎక్కడా చేయిచాపడం లేదు. అధిక వడ్డీల బాధ లేకుండా పోయింది. ఇప్పుడు అందిన రైతుబంధు డబ్బులతో ఎరువులు తెచ్చుకుంటా.. కూలి ఖర్చుల కోసం కొంతమొత్తాన్ని కేటాయించాను. నాకు ఒకప్పుడు ఉన్న కష్టాలు రైతుబంధుతో ఇప్పుడు లేవు. ఎంతో ఆనందంగా ఉంది.