నిజామాబాద్ క్రైం,జనవరి 5 : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఎంపీపై నిజామాబాద్ నగరంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన బంగారు సాయిలు ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు చేసినట్లు ఐదో టౌన్ ఎస్సై ఏ.రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. ఫిర్యాదును హైదరాబాద్‌లోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఎస్సై వివరించారు. దీంతో పాటు ఫిర్యాదు ఒరిజినల్ కాపీని కానిస్టేబుల్‌తో మాదన్నపేట్ పీఎస్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. అక్కడి పోలీస్ స్టేషన్లో ఎంపీ అర్వింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ అడిషనల్ డీసీపీ విచారణ జరుపుతున్నారని వెల్లడించారు.