యాదాద్రి భువనగిరి, డిసెంబరు 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అణువణువూ ఆధ్యాత్మికతతో… అడుగడుగూ అత్యద్భుతంగా రూపుదిద్దుకున్నది యాదాద్రి దివ్యక్షేత్రం. ప్రస్తుతం వసతుల పనులు ముమ్మరంగా సాగుతుండగా, వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో భక్తకోటికి మూలవరుల దర్శనభాగ్యం కలుగనున్నది. ఇప్పుడు సాధారణ రోజుల్లో వచ్చే భక్తుల సంఖ్య 10 వేలు దాటుతుండగా, ప్రత్యేక రోజుల్లో 40వేల నుంచి 50వేల వరకు ఉంటున్నది. ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం పంచ నారసింహుడి దర్శనానికి వచ్చే వారి సంఖ్య లక్షకుపైనే ఉండొచ్చన్నది అంచనా. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలపై రాచకొండ పోలీస్ శాఖ దృష్టి సారించింది. తిరుమల తరహాలో పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇటీవల తిరుమలలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి వచ్చిన ఉన్నతాధికారులు.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే పనిలో నిమగ్నమయ్యారు. భద్రతాపరంగా భక్తులకు పూర్తి భరోసా కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అనేక విశేషాల సమాహారంగా యాదాద్రి పంచనారసింహ క్షేత్రం రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా.. దేశానికే తలమానికంగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పునర్నిర్మాణం పూర్తికాగా తుది మెరుగులు పూర్తికావస్తున్నాయి. ఆలయ పునః ప్రారంభం తేదీ సైతం ఖరారు కావడం.. ముహూర్తం దగ్గర పడుతుండడంతో వైటీడీఏ వసతుల కల్పనపై దృష్టిపెట్టి ఆ దిశగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నది. ఆలయ పునః ప్రారంభం తర్వాత భక్తుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో భద్రతాపరంగా తీసుకునే చర్యలపై పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది.
విజిలెన్స్ సెక్యూరిటీతో పటిష్ట భద్రత…
ప్రస్తుతం యాదాద్రిలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపడుతున్నారు. 30 మంది హోంగార్డులతోపాటు ఏఆర్, ఎస్పీఎఫ్ బలగాలకు చెందిన రెండు బృందాలు భద్రతా చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి. నిత్యం నలుగురు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో పెరిగే భక్తుల సంఖ్యకు అనుగుణంగా పటిష్ట భద్రత కోసం అదనపు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నదని పోలీస్ శాఖ భావిస్తున్నది. ఇందులో భాగంగా తిరుపతి తరహాలో విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వద్ద ఉంచేందుకు రాచకొండ పోలీస్‌శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. తిరుమలలో సివిల్ పోలీసుల కంటే భద్రతాపరమైన అంశాలలో విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందిదే కీలకపాత్ర ఉంటుంది. యాదాద్రిలోనూ ఈ తరహా వ్యవస్థ అవసరమని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఎస్పీ స్థాయిలో కాకున్నా.. తొలుత ఏసీపీ హోదా అధికారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేలా ఓ పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. గోపురాలు, ధ్వజస్తంభం, ప్రధాన ద్వారం తదితర వాటికి పెద్ద మొత్తంలో బంగారం వెచ్చిస్తుండడం, స్వామివారి నగలు, బంగారం, వెండి ఆభరణాల భద్రతా దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు ఆక్టోపస్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ వంటి సాయుధ బలగాలతో భద్రతా చర్యలు కల్పించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక కొత్తగా ఏర్పాటు చేసే బస్టాండ్ పక్కనే ఒక టెంపుల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు టెంపుల్పైన ఒక అవుట్ పోస్ట్, టెంపుల్ సీటీపైన మరో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచనున్నట్లు సమాచారం.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా…
యాదాద్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న బస్ టెర్మినల్ వద్ద ప్రధాన భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే భక్తులను కొండపైకి పంపించేలా ఏర్పాట్లు చేయనున్నారు. భక్తులు సామగ్రిని భద్రపర్చుకునేందుకు బస్ టెర్మినల్, గుట్టపై క్యూకాంప్లెక్స్ వద్ద క్లాక్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులతోపాటు లగేజీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర నిషేధిత వస్తువులను గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్లు, ఇతర ఎక్విప్మెంట్లను సిద్ధం చేయనున్నారు. పిల్లల అపహరణ, చోరీలకు అవకాశం లేకుండా క్షణాల్లో నిందితులను గుర్తించేందుకు పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంతోపాటు, చుట్టూ, అన్ని వీధుల్లోనూ 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పాత నేరస్తులను వెంటనే గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం, జామర్లు, భక్తుల తనిఖీల కోసం భారీగా సమకూర్చాల్సిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ మెటల్ డిటెక్టర్ల అవసరాన్ని సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే తరలించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం లోపల సెల్ఫోన్లను అనుమతించకుండా చూడాలని వైటీడీఏ, రాచకొండ పోలీసులు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది.