పర్ణశాల, డిసెంబర్ 31 : ముక్కోటి అధ్యయనోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు భద్రాచలం ఆలయ ఈవో బానోతు శివాజీ పేర్కొన్నారు. పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ముక్కోటి ఉత్సవాలు ఈ నెల 3 నుంచి పర్ణశాల ఆలయంలో ప్రారంభమవుతాయన్నారు. 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనం, 14న రథోత్సవం ఉంటాయని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేననన్నారు. తెప్పోత్సవం నిర్వహించే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలను పరిశీలించాలని, నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఇసుక బస్తాలు వేసి తెప్పోత్సవం నిర్వహించాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఆలయ ప్రాంతంలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సర్పంచ్ వరలక్ష్మికి సూచించారు. సమీక్షలో ఏఈవో భవానీ రామకృష్ణ, సీసీ అనిల్, డీఈ రవీందర్, సూపరింటెండెంట్ కిశోర్, అర్చకులు భార్గవాచార్యులు, కిరణ్కుమారాచార్యులు, ఆలయ గుమాస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాల ఆలయాన్ని సివిల్ సైప్లె జిల్లా అధికారి చంద్రప్రకాశ్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పంచవటి, నారచీరెల ప్రాంతాన్ని సందర్శించారు. వారి వెంట జీసీసీ డీలర్ ముత్తయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.