
ఎదులాపురం, డిసెంబర్ 28 : శాంతిభద్రతలు పటిష్టంగా ఉండడానికి సాయుధ బలగాలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లో మోటర్ ట్రాన్స్‌ఫోర్ట్ పరిపాలన, డాగ్ స్కాడ్, బాంబు డిస్పోజల్ స్కాడ్, వాటర్ ప్లాంట్, హోంగార్డ్, పోలీస్ స్టార్ ఆయుధ భాండాగారం తదితర విభాగాలను మంగళవారం ఎస్పీ సందర్శించారు. సాయుధ పోలీస్ అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ప్రతి విభాగంలోకి వెళ్లి పనితీరును పరిశీలించారు. దస్ర్తాలు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు , రిజిస్టర్లు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విభాగాలు 5ఎస్ విధానంలోనే విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని, అసాంఘిక శక్తులు జిల్లాలో ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతంలో పటిష్టమైన సాయుధ పోలీస్ బలగాలు నిరంతరం గాలింపు చేపడుతుంటాయని పేర్కొన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన ఎనిమిది పోలీస్ జాగిలాలున్నట్లు తెలిపారు. వాటి పనితీరును స్వయంగా పరిశీలించారు. పలు వివరాలను ట్రైనర్లను అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ డీఎస్పీ ఎం.విజయ్ కుమా ర్, రిజర్వ్ సీఐ గడికొప్పుల వేణు, బీ శ్రీపాల్, వంశీకృష్ణ, డీ వెంకటి, డాగ్ స్కాడ్ ఇన్చార్జి, బీడీ టీం ఇన్చార్జి జే ప్రేమ్‌సింగ్ పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన ‘సనాతన’ సమితి నాయకులు
ఆదిలాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డీ ఉదయ్ కుమార్ రెడ్డిని మంగళవారం సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, నాయకులు పడకంటి సూర్యకాంత్, లోలపు శ్రీనివాస్, పొట్టిపెల్లి విజయ్ కుమార్, బరాడి లక్ష్మీకాంత్, బండారి దేవన్న, గౌరువార్ సతీశ్, సాయకృష్ణ, కోటావార్ సర్పాగౌడ్, మహిళా అధ్యక్షురాలు శశికళ పాల్గొన్నారు.
ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం..
బేల, డిసెంబర్ 28 : ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా పోలీసులకు సమాచారమందిస్తే సత్వరమే పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి అన్నారు. బేల పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. జిల్లాలో పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు సత్వరమే పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామీణుల కోసం ఫ్రెండ్లీ పోలీస్ సేవలు అందిస్తున్నామని, నంబర్ 100కు డయల్ చేసిన 10 నిమిషాల్లోనే అందుబాటులో ఉంటారని అన్నారు. పెట్రో కార్ వాహనాలు ప్రతి మండలంలో అందుబాటులో ఉన్నాయని, మహిళల కోసం షీటీంలున్నాయని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారి బేల పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎస్పీకి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ మల్లేశ్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట పోలీసులు మధన్, శ్రీనివాస్ ఉన్నారు.