
వంగూరు, డిసెంబర్ 19: రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇక యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మండలంలోని కొండారెడ్డిపల్లిలో టీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల నడ్డి విరచాలని చూడగా ఏడాది పాటు రైతులు ఉద్యమం చేపట్టడంతో వెనక్కు తీసుకున్నదని తెలిపారు. నేడు ధాన్యం కొనుగోలు చేయకుండా కార్పొరేట్లకు వంత పాడుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో సాగు పెరిగిందని సీఎం కేసీఆర్ కేంద్రంతో ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ధాన్యం కొనుగోలు చేయమని మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మోడీ సర్కారు మెడలు వంచకపోతే రాబోయే కాలంలో రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. డిండి ప్రాజెక్టు (డీఎల్ఐ), కేఎల్ఐతో పాటు అచ్చంపేట మండలంలోని మరిన్ని గ్రామాల రైతులకు నష్ట పరిహారం అందించే విషయమై సీఎం కేసీఆర్తో మాట్లాడి త్వరలో అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి దీనంగా ఉన్నదని, వారు ఆందోళనకు గురికావొద్దని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో నల్లమలకు సీఎం కేసీఆర్
నల్లమల ప్రాంతానికి సాగునీరు అందించడంలో భాగంగా చేపట్టబోయే ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టుల భూమిపూజకు త్వరలో సీఎం కేసీఆర్ నల్లమలకు రానున్నారని ప్రభుత్వ విప్ గువ్వల తెలిపారు. అచ్చంపేట, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూర్ మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు చెప్పారు. వంగూరు మండలం గాజర, కోనేటిపూర్, తిప్పారెడ్డిపల్లి, తిరుమలగిరి గ్రామాలకు డీఎల్ఐ-2 ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు లాలూయాదవ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు సీఎంరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు హమీద్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, నాయకులు గణేశ్రావు, రాజారంగారావు, హరినాథ్, నాయకులు పాల్గొన్నారు.