
కొత్త జోనల్ విధానం ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తయ్యింది. ఉద్యోగుల విభజన నాలుగు రోజుల కిందే పూర్తయినా, టీచర్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. గురువారం ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్లకు జిల్లాల కేటాయింపు సమాచారం మెసేజ్ రూపంలో అందింది. ఉద్యోగులు ఇప్పటికే ఆయా జిల్లాల కార్యాలయాల్లో రిపోర్ట్ చేశారు. జోనల్ పరిధిలోని సీనియార్టీ జాబితా గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
నీలగిరి, డిసెంబర్ 23 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త జోనల్ విధానం ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన మూడేండ్ల తరువాత జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయించింది. వారు అప్పటి నుంచి నాలుగేండ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. పాత జోనల్ విధానంతో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంతో శాశ్వత ప్రతిపాదికన జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎక్కడా అభ్యంతరాలు వచ్చినా వెంటనే పరిష్కరిస్తూ ముందుకు సాగడంతో అంతా ప్రశాంతంగా జరిగింది. ఉద్యోగుల కేటాయింపులు నాలుగు రోజుల క్రితం పూర్తి కాగా ఉపాధ్యాయులది సైతం బుధవారం పూర్తి చేశారు. గురువారం ఉపాధ్యాయులకు జిల్లాల కేటాయింపు సమాచారం మొబైల్స్‌కు చేరింది. ఇక ఉద్యోగులు ఇప్పటికే ఆయా జిల్లాల కార్యాలయాల్లో రిపోర్టు చేశారు. అయితే జోనల్ పరిధిలోని సీనియార్టీ జాబితా గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉద్యోగుల విభజన ప్రశాంతంగా ముగిసింది. విద్యాశాఖలో కొంత అయోమయం ఏర్పడినా కలెక్టర్ కలుగజేసుకోవడంతో ఆ శాఖ కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వగా మొత్తంగా 21,200 మంది ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇతర జిల్లాల్లో పనిచేస్తూ ఇక్కడకు డిప్యుటేషన్‌పై వచ్చిన వారు, ఒక్కటే పోస్టింగ్ ఉండి ఇతర జిల్లాకు పోయిన వారితోపాటు ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా ఆయా శాఖల అధికారులు పరిగణనలోకి తీసుకోవడంతో ఉన్న ఉద్యోగులకు అదనంగా మూడు వేల మంది జాబితాలోకి వచ్చారు. వారందరిని పరిశీలన చేసి ఖాళీ స్థానాలు ఖాళీగా చూపించడంతోపాటు డిప్యుటేషన్ పై వెళ్లిన వారిని తీసుకుని, ఇతర జిల్లా నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వారిని తొలగించగా జిల్లాలో మొత్తంగా 18,245 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించి వారికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ జాబితా ప్రకారంగా సీనియార్టీ జాబితాను తయారు చేసి ఆప్షన్లు ఇచ్చారు. ఈప్రక్రియ అంతా కూడా బుధవారం రాత్రి ముగియడంతో వారికి నియామక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో వారు గురువారం, శుక్రవారాల్లో ఆయా కార్యాలయాల్లో రిపోర్టులు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో చాలా వరకు ఉద్యోగులు రిపోర్టులు చేశారు.
ఎంచుకున్న స్థానాలకు ఉద్యోగులు
జిల్లాలో మొత్తం 18,245 మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. అత్యధికంగా విద్యా, పోలీస్ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. సీనియార్టీ జాబితా ప్రకారంగా ఉద్యోగులు ఎంచుకున్న స్థానాలకు కేటాయించారు. జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా వరకు ఇక్కడే తమ ఆప్షన్లు ఎంపిక చేసుకోగా అతితక్కువ మంది మాత్రమే ఇతర జిల్లాలకు ఆప్షన్లు ఎంచుకున్నారు. ఏ ఉద్యోగి ఏజిల్లాకు బదిలీ కోరుకున్నారు. సీనియార్టీ ప్రకారంగా కేటాయింపులు చేసి వారికి ఉత్తర్వులను అందజేశారు. అందులో చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున వేరే జిల్లాలకు ఇప్పట్లో పంపితే కుటుంబాలు ఇబ్బందులు పడుతాయని కోరినప్పటికీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా యంత్రాంగం వారందరికీ ఉత్తర్వులను జారీ చేసింది.
ఆప్షన్ల అనుగుణంగా కేటాయింపు
ఇదంతా జూనియర్ అసిస్టెంట్ నుంచి కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఇక్కడ కేటాయింపులు చేశారు. సీనియర్ అసిస్టెంట్ అపై స్థాయి అధికారుల విభజన ప్రక్రియ జోనల్ స్థ్ధాయిలో జరుగుతుండడంతో నేడు లేదా రేపు సీనియార్టీ జాబితా రానుంది. ఇప్పటివరకు 9వేల పైచిలుకు ఉద్యోగులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను సిద్ధ్దం చేసిన జిల్లా యంత్రాంగం దాని ప్రకారంగా ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కేటాయించారు. కేవలం 5శాతం సీనియార్టీ తక్కువగా ఉన్న ఉద్యోగులకు మాత్రమే అనుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌లు లభించలేదు.
ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తి..
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగుల విభజన పూర్తయినప్పటికీ విద్యాశాఖ కేటాయింపుల్లో మాత్రం కొంత అయోమయం ఏర్పడింది. ఉపాధ్యాయుల కేటాయింపులో సీనియార్టీ జాబితాలో తప్పులు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలపడంతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కలుగజేసుకుని దగ్గరుండి ఒక్కొక్కటిగా పరిశీలించి ఉద్యోగుల సీనియార్టీ జాబితాను తయారు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12,219 మంది ఉద్యోగులు ఉండగా వారిచ్చిన ఆప్షన్లు, సీనియార్టీ ప్రకారం నల్లగొండ జిల్లాకు 5,605, సూర్యాపేట జిల్లాకు 3,692, యాదాద్రి భువనగిరి జిల్లాకు 2,922 మంది ఉద్యోగులను కేటాయించారు.