
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎఫ్‌సీఐ నిర్లక్ష్యంతో రైస్ మిల్లుల్లో ధాన్యం గుట్టలుగా పేరుకు పోతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్లులన్నీ ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. సామర్థ్యానికి మించి నిల్వ చేయాల్సి వస్తుండడంతో మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిల్లులతోపాటు మార్కెట్ యార్డుల్లోని షెడ్లల్లోనూ ధాన్యం బస్తాలను నిల్వ చేస్తున్నారు. దీనంతటికీ ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరే కారణమన్నది బహిరంగ సత్యం. మిల్లుల్లో సామర్థ్యానికి మించి ఇప్పటికే 50 శాతం ధాన్యం అదనంగా పోగుపడగా, వానకాలం సీజన్‌కు సంబంధించి మరో లక్ష మెట్రిక్ టన్నులు రానున్నది. దాన్ని కూడా సీఎంఆర్ కోసం మిల్లులకు తరలించాల్సిందే. కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావు. తాజాగా.. నల్లగొండకు రైల్వే వ్యాగన్ రాగా, దాన్ని లోడ్ చేయడంలో ఎఫ్‌సీఐ చేసిన జాప్యం కారణంగా ఖాళీగా వెనక్కి వెళ్లినట్లు తెలిసింది.
ఇది ఆ సంస్థ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎఫ్‌సీఐ తీరుతో రైతులు, మిల్లర్లు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా.. తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎఫ్‌సీఐ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. రైస్‌మిల్లర్లు ఇచ్చిన బియాన్ని తీసుకొని నిల్వ చేసేందుకు గోదాములను ఏర్పాటు చేసుకోలేదు. పైగా ఎఫ్‌సీఐ పరిధిలోని గోదాముల్లో బియ్యాన్ని తరలించేందుకు ఇప్పటికే అవసరమై రైల్వే వ్యాగన్లను కూడా తెప్పించ లేదు. దాంతో యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లుల్లో పేరుకుపోగా.. వానకాలంలో కొనుగోలు చేసిన ధాన్యంతో పూర్తిగా నిండిపోయాయి. రైస్‌మిల్లుల్లో స్థలం అందుబాటులో లేక మిల్లర్లు నానా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సామర్థ్ధ్యానికి మించి మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోగా.. బయట మార్కెట్ గోదాముల్లోని షెడ్లను సైతం నిల్వల కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 210 రైస్‌మిల్లుల్లో సీఎంఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది. నల్లగొండలో 110, సూర్యాపేటలో 60, యాదాద్రి జిల్లాలో 40 రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం సేకరించిన దొడ్డు రకం ధాన్యాన్ని వీటిలో సీఎంఆర్‌గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. వీటిలో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్ధ్యం ఉన్నట్లు అంచనా.. కానీ ప్రస్తుతం 17 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా నిల్వలు ఉన్నట్లు సివిల్ సప్లయ్ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇంకా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాల నుంచి వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో స్థలం కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
గత యాసంగి ధాన్యం ఇలా….
యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు తరలించారు. సీఎంఆర్ సేకరణలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం కారణంగా నల్లగొండ జిల్లాలో 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అలాగే ఉంది. సూర్యాపేట జిల్లాలో 4లక్షలకు పైగా యాదాద్రి జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ఉంది. కానీ బియ్యాన్ని తీసుకోవడం, తీసుకున్న దాన్ని వెంటవెంటనే తరలించడం, రైల్వే వ్యాగన్లు తెప్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతున్నది. ఇక ఈ ధాన్యానికి తోడు ప్రస్తుత వానకాలం సీజన్ ధాన్యం కూడా మిల్లులకే వస్తున్నది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 3.50 లక్షలు, సూర్యాపేటలో 2.60లక్షలు, యాదాద్రిలో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీన్ని కూడా సీఎంఆర్ కోసం రైస్‌మిల్లులకే తరలించారు. రైస్‌మిల్లుల్లో స్థలం లేకపోవడంతో అందుబాటులో ఉన్న మార్కెట్ కమిటీ షెడ్లల్లోనూ నిల్వ చేస్తున్నారు. దొడ్డురకం ధాన్యానికి తోడు మిల్లర్లు సొంతంగా కొనుగోలు చేసిన సన్నాలు సైతం మిల్లుల్లోనే నిల్వ ఉన్నాయి. వీటిన్నింటి నేపథ్యంలో రైస్‌మిల్లర్లు తీవ్ర ఇక్కట్లకు గురువుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు జిల్లా అధికారులు ఇబ్బందికి గురవుతున్నారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపు కత్తిమీద సాములా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.తీరు మారని ఎఫ్‌సీఐ…
ఈ సీజన్లో కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐల వ్యవహార శైలిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తూనే ఉంది. ధాన్యం కొనుగోళ్లల్లో పరిమితుల నుంచి ఎఫ్‌సీఐ సేకరణలో నిర్లక్ష్యం వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఢిల్లీ వేదికగా రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం నేటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా ఎఫ్‌సీఐ తీరులో మార్పు రావడం లేదు. ఈ సీజన్లో ప్రైవేటు గోదాములను లీజుకు తీసుకోవడంలో ఎఫ్‌సీఐ విఫలమైంది. దాంతో సీఎంఆర్ ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు లేక మిల్లుల్లోని ధాన్యాన్ని బాయిల్డ్ బియ్యంగా మార్చడం సాధ్యం కావడం లేదు. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఇచ్చే సీఎంఆర్ బియ్యాన్ని తరలించడంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతున్నది. రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేసి బియ్యాన్ని తరలించాల్సి ఉండంగా అదీ చేయడం లేదు. ఉమ్మడి జిల్లాకు నెలకు 70 రైల్వే వ్యాగన్లు అవసరం కాగా 30కి మించి రావడం లేదు. దాంతో బియ్యాన్ని తరలించడంలో జాప్యం జరిగి ధాన్యం రాశులు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. గురువారం నల్లగొండకు రైల్వే వ్యాగన్ వస్తే లోడ్ చేయడంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం చేయడంతో అది వెనక్కి వెళ్లినట్లు సమాచారం. వ్యాగన్ వచ్చాక లోడ్ చేయడానికి హామాలీలు ముందుకు రావడం లేదన్న నెపంతో ఎఫ్‌సీఐ పట్టించుకోలేదు. దీంతో నిర్ణీత సమయం తర్వాత అది వెళ్లిపోయినట్లు సమాచారం. ఇందులో లోడ్ వెళ్లి ఉంటే మూడు వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల నుంచి ఖాళీ అయ్యేది. గోదాములను సమకూర్చుకోవడం, రైల్వే వ్యాగన్ల ఏర్పాటులో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తుండడంతో జిల్లాలోని రైస్మిల్లులన్నీ ధాన్యంతో నిండి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో మిల్లర్లు ఇబ్బందిపడాల్సి వస్తున్నది
కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని మిల్లర్లు ఇబ్బందిపడాల్సి వస్తున్నది. వానకాలంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం లేదు. యాసంగిలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు తరలించారు. మిల్లర్లు సైతం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మిల్లింగ్ చేశారు. కానీ కేంద్రప్రభుత్వం, ఎఫ్‌సీఐ సకాలంలో బియ్యం సేకరించకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ అధికారులు స్పందించి మిల్లుల్లో నిల్వ చేసిన బియ్యాన్ని తీసుకొని ఖాళీ అయ్యేందుకు సహకరించాలి.
కస్టమ్ మిల్లింగ్ ధాన్యం నిల్వ కష్టంగా మారింది
రైస్ మిల్లుల్లో కస్టం మిల్లింగ్ ధాన్యం నిల్వ చేయడం చాలా కష్టంగా మారింది. యాసంగి కస్టమ్ మిల్లింగ్ బియ్యం సిద్ధ్దంగా ఉంది. బియ్యాన్ని ఇంతవరకు ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదు. ప్రస్తుతం వానకాలం ధాన్యం సీఎంఆర్ కోసం తీసుకొని నిల్వ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. మిల్లుల్లో ధాన్యం నిల్వలు నిండుగా ఉండడంతో మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే యాసంగి సీఎంఆర్ బియ్యం తీసుకోవాలి. ఈ నిల్వలు కదిలితేనే మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేయలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా యాసంగి బియ్యం నిల్వలు వెంటనే తీసుకోవాలి.