
ఖమ్మం, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నూతనంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిసెంబర్ 2021 నాటికి పట్టాదారు పాస్‌పుస్తకం కలిగిన రైతులందికీ రైతుబంధు వర్తించనున్నది. దీంతో ఖమ్మం జిల్లాలో మరో 11,600 మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి యాసంగి సీజన్‌కు సంబంధించిన పంటల పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయనుండడంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం విజయనిర్మల ఆయా మండల, డివిజన్ వ్యవసాయశాఖ అధికారులకు గూగుల్ మీట్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ పథకం ఆరంభంలో వానకాలం సీజన్లో 2,85 348 మంది రైతులకు ఎకరానికి రూ.4 వేలు చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.275.03 కోట్లను అందజేశారు. మూడేళ్లలో పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన రైతుల సంఖ్య 3.16 లక్షలకు చేరింది. పెట్టుబడి సాయం రూ.275 కోట్ల నుంచి రూ.362 కోట్లకు పెరిగింది. ఈ పథకం ప్రారంభంలో ఎకరానికి రూ.4వేల చొప్పున సాయం అందించగా.., ప్రస్తుతం ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి.
చండ్రుగొండ, డిసెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను రైతులు పాటించడం మొదలెట్టారు. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో రావికంపాడు గ్రామానికి చెందిన నిజాంపట్నం రామకృష్ణ తనకున్న ఎకరం పొలంలో అర ఎకరం మొక్కజొన్న(స్వీట్‌కార్న్), మరో అర ఎకరంలో టమాటా సాగు చేస్తున్నాడు. వ్యాపారులు, స్థానికులు రైతు వద్దకే వచ్చి టమాటా కిలో రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నారు. అర ఎకరంలో టమాటా సాగు చేయటం వల్ల పెట్టుబడి పోను రూ.40 వేలు లాభం వచ్చిందని రైతు తెలిపాడు. అదేవిధంగా మరో అర ఎకరంలో వేసిన మొక్కజొన్న(స్వీట్‌కార్న్) పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. రూ.50 వేల వరకు లాభం వస్తుందని రైతు ఆశిస్తున్నాడు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతుండడంతో రైతులు ఆ దిశలో పయనిస్తున్నారు.
తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం
నా ఎకరం భూమిలో వరికి బదులు మెరక పంటలను సాగు చేస్తున్నాను. అర ఎకరంలో టమాటా, మరో అర ఎకరంలో మొక్కజొన్న వేశాను. రూ.లక్ష వరకు లాభం వస్తుందని ఆశిస్తున్నాను. ఈ రకం పంటలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందొచ్చు. అవగాహన కల్పిస్తే మరింతమంది రైతులు ఇతర పంటలు వేసే అవకాశం ఉంది.
చండ్రుగొండ, డిసెంబర్ 22 : ముప్పాతిక భూమిలో సగం టమాటా, మరో సగం బెండకాయ సాగు చేస్తూ లాభాలను అర్జిస్తున్నాడు మండలంలోని రావికంపాడు గ్రామానికి చెందిన రైతు నిజాంపట్నం నాగేశ్వరరావు. కూరగాయల సాగులో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రూ.12 వేలకు ముప్పాతిక భూమిని కౌలుకు తీసుకొని ఇప్పటివరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం బెండకాయలు కోతకు వచ్చాయి. ప్రతి రోజూ 50కిలోల వరకు దిగుబడి వస్తుండగా కిలో బెండకాయ రూ.30 వరకు ధర పలుకుతున్నది. దీంతో రోజూ రూ.1,500 వరకు ఆదాయం రెండునెలల పాటు వస్తుంది. మరోపక్క టమాటా సైతం మరో పది, పదిహేను రోజుల్లో దిగుబడి(కోతలు) మొదలవుతుందని, మంచి ధర ఉంటే దీనిపై కూడా మంచి లాభాలు వస్తాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆరుతడి పంటలు వేయటం వల్ల సాగునీరు ఆదా, పంట మార్పిడి పద్ధతితో భూసారం పెరుగుతుందని రైతు చెబుతున్నాడు.
కూరగాయల సాగుతో లాభాలు
కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. కూరగాయలు ప్రస్తుతం మంచి ధరలు పలుకుతున్నాయి. డిమాండ్ మేరకు ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ప్రతిరోజూ చేతిలో నగదు ఉంటుంది. ఆరుతడి పంటలు, కూరగాయ సాగు రైతులకు ఎంతో మేలు చేస్తాయి.