మక్తల్‌రూరల్, డిసెంబర్ 15: మక్తల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈసందర్భంగా బస్టాండ్ పరిసరాల్లోని స్థలాలను కొందరు టెండర్లో నామమాత్రపు లీజుకు తీసుకుని ఎక్కువ స్థలాన్ని కబ్జా చేశారు. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేట డిపో మేనేజర్ సూర్యప్రకాశ్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. స్థానిక బస్‌స్టేషన్‌లో దాదాపు రెండు ఎకరాల స్థలం ఉందని, ప్రయాణికులు వాహనాలు నిలుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డిపో మేనేజర్‌పై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పరిరక్షించాలని, నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. మక్తల్ మండల విద్యార్థుల కోసం పాఠశాలల వేళల్లో బస్సులు నడిపించాలని కోరారు.
జాతర ఏర్పాట్లు పరిశీలన
మక్తల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన పడమటి ఆంజనేయస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే చిట్టెం పరిశీలించారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలకు కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆలయం సమీపంలోని రాంలీల మైదానాన్ని, ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం, వాహనాలు నిలపడానికి సరైన పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో సత్యనారాయణను ఆదేశించారు. మిఠాయి దుకాణాలను వాటర్ ట్యాంక్ పక్కన వేసుకోవాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆట వస్తువులు పెట్టుకోవడానికి వ్యాపారులకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యేవెంట ఎస్సై రాములు, పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి ఉన్నారు.