పాల్వంచ, జనవరి 8 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మండిగ నాగ రామకృష్ణ కుటుంబ సభ్యుల సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడైన వనమా రాఘవను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు శనివారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. పాత పాల్వంచలో ఈ నెల 3న మండిగ నాగ రామకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సాహిత్య సజీవ దహనమయ్యారు. మరో కుమార్తె సాహితి తీవ్ర గాయాలపాలై కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 5వ తేదీన మృతిచెందింది. నాగ రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో తమ చావుకు కారణం తల్లి సూర్యావతి, అక్క లోవా మాధవి, వనమా రాఘవ అని పేర్కొన్నాడు. వనమా రాఘవ డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు తన భార్యనూ ఆశించాడని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. మృతుడి బావమరిది జనార్దన్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు వనమా రాఘవతో పాటు మృతుడి తల్లి సూర్యావతి, అక్క లోవా మాధవిపై కేసు నమోదు చేశారు. సజీవ దహన ఘటన తర్వాత నిందితుడు వనమా రాఘవ పరారయ్యాడు. పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. రెండు తెలుగు రాష్ర్టాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దమ్మపేట ఎస్సై శ్రావణ్, పోలీస్ సిబ్బంది ఇదే మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వస్తున్న టీఎస్ 28 ఎల్ 0001 నంబర్ గల కారును ఆపారు. కారులో వనమా రాఘవ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం 10 వరకు పాల్వంచ డీఎస్పీ కార్యాలయం ఎదుట హైడ్రామా జరిగింది. శనివారం ఉదయం సుమారు 10.30 గంటల తరువాత రాఘవేందర్‌ను మెడికల్ చెకప్ నిమిత్తం తరలించారు. అనంతరం 11 గంటల తరువాత పాల్వంచ డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏఎస్పీ బిరుదురాజు రోహిత్‌రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు నిందితుడి పరారీకి సహకరించిన ముక్తేవి గిరీశ్, డ్రైవర్ కొమ్ము మురళి, చావా శ్రీనివాస్, రమాకాంత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో చావా శ్రీనివాస్, రమాకాంత్ పరారీలో ఉన్నారు. పోలీసులు శనివారం పాల్వంచలోని ఏఎస్పీ కార్యాలయానికి రాఘవను తీసుకువచ్చారు. వైద్యనిపుణులు నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని 2వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యూడీషియల్ న్యాయమూర్తి ముద్దసాని నీలిమ ఎదుట హాజరు పరిచారు. అనంతరం 14 రోజుల రిమాండ్ నిమిత్తం భద్రాచలంలోని సబ్‌జైలుకి తరలించారు. పాల్వంచ పోలీస్ స్టేషన్లో రాఘవపై మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. గతేడాది మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులోనూ నిందితుడిపై 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో పోలీసులు పారదర్శకంగా విచారణ చేపడుతున్నారని ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు ప్రవీణ్, రతీశ్, సుమన్ పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన..
నలుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడైన వనమా రాఘవేందర్రావును కఠినంగా శిక్షించాలని, రౌడీషీట్ ఓపెన్ చేయాలని వివిధ పార్టీల నేతలు డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.