రాష్ట్రంలోని పేదవారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్‌కు దీటుగా మారుతున్నాయి. మోర్తాడ్, బాల్కొండ ప్రభుత్వ దవాఖానలను వైద్యవిధాన పరిషత్‌లోకి చేర్చారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించి స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. నియోజకవర్గంలోని దవాఖానల్లో వసతుల కల్పనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మోర్తాడ్, జనవరి 5 : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సర్కారు దవాఖానలన్నీ కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్నాయని తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో రూ.12.5 లక్షలతో నిర్మించనున్న మార్చురీ భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు, ల్యాబ్, మినరల్‌వాటర్ ప్లాంట్, రిసెప్షన్ కౌంటర్, ఐసీయూ క్యాబిన్లను ప్రారంభించారు. దవాఖానలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని చెప్పారు. వైద్యం విషయంలో ఇప్పటికే విజయం సాధించామని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న ఖాళీలను 15 రోజుల్లో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
వైద్యవిధాన పరిషత్‌లోకి మోర్తాడ్, బాల్కొండ దవాఖానలు..
మోర్తాడ్, బాల్కొండ ప్రభుత్వ దవాఖానలు వైద్యవిధాన పరిషత్‌లోకి చేర్చినట్లుగా మంగళవారమే ప్రభుత్వ జీవో వచ్చిందని మంత్రి వెల్లడించారు. దీంతో ఆయా దవాఖానల్లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్యసేవలు కూడా మెరుగుపడుతాయని చెప్పారు.
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు సంతృప్తినిచ్చింది..
రెండు దశల్లో కరోనా విజృంభించినప్పుడు ఆక్సిజన్, బెడ్ల కొరతతో ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయిన ఘటనలు మనసుకు బాధ కలిగించాయని, నిద్రపట్టని రాత్రులు కూడా తాను ఎదుర్కొన్నట్లు మంత్రి తెలిపారు. అలాంటి సందర్భంలో వచ్చిన ఆలోచనతోనే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు బీజం పడిందని చెప్పారు. తన భార్య నీరజ, మిత్రుల సహకారంతో మోర్తాడ్ సీహెచ్‌సీలో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, మోర్తాడ్, వేల్పూర్, బాల్కొండలో 18 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన ప్రతిఒక్కరికీ మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేసుకున్నందుకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు త్వరలో మోర్తాడ్ సీహెచ్‌సీలో పోస్టుమార్టం సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సర్పంచ్ ధరణి, ఎంపీటీసీ రాజ్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.