
శ్రీశైలం, డిసెంబర్ 20 : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్నకు ధనుర్మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని వార్షిక ఆరుద్రోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటలకు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించారు. ముందుగా గణపతి పూజ చేసి గర్భాలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక లింగోద్భవకాలంలో రుద్రాభిషేకం, అన్నాభిషేకం, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, మహామంగళహారతి, స్వామి, అమ్మవార్లకు ప్రాత:కాల పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ ముఖ మండపంలో ఉత్తర ముఖంగా వేంచుంబజేసి ప్రత్యేక పూజలు చేశారు. నంది వాహనంపై ఆసీనులైన స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు అర్చక వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.