
మహబూబ్నగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కంప్యూటర్లతో కు స్తీ పట్టే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలాల బాట పట్టారు. వ్యవసాయాన్ని దగ్గరి నుంచి గమనించి రైతుకు తమ వల్ల ఏదైనా మేలు జరగాలనే ఆలోచనతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రంలోనే హ్యాకథాన్ నిర్వహణకు నడుంబిగించిందని ఆ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తలా తెలిపారు. కిసాన్ దివస్ను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు నిర్వహించే ఈ హ్యాకథాన్ను నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం యడవల్లిలో ప్రారంభించారు. 45 రోజుల పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు టెక్నాలజీని వినియోగించి పొలాల వద్ద రైతులకు సహకరించనున్నారు. 2 ఎకరాల స్థలం ఎంచుకొని అందులో ఒక్కో బృందానికి ఒక కుంట మేరకు స్థలం ఇచ్చి అందులో వ్యవసాయం చేస్తూ అక్కడ ఎదురయ్యే సమస్యలకు ఈ హ్యాకథాన్ ద్వారా పరిష్కారం అందించనున్నారు. ఐదుగురు సభ్యుల ఈ బృందంలో ఐటీ ఉద్యోగులతో పాటుగా అగ్రికల్చర్ ఇంజినీర్లు కూడా ఉంటారు. వారాంతాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలానికి వెళ్తారు. వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న ఈ వినూత్న విధానానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్, తెలంగాణ అగ్రికల్చర్ ఇంజినీర్స్ అసోసియేషన్ కలిసి పనిచేస్తాయని సందీప్ తెలిపారు.