
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ768 మందికి 738 మంది ఓటు హక్కు వినియోగం
ఖమ్మం, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలంలోని ఆర్డీవో కార్యాలయాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 768 మంది ఓటర్లకు 738 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌శాతం 96.09గా నమోదైంది. ఉదయం పది గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకున్నది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇండిపెండెంట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యాయి. మాస్క్ ధరించి ఓటర్లు పోలింగ్‌కు వచ్చారు. పోలింగ్ కేంద్రంలో భౌతిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ సరళిని
పరిశీలించిన మంత్రి అజయ్‌కుమార్..
పోలింగ్ కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధుసూదన్, ఎంపీ నామా నాగేశ్వరరావు, శాసనసభ్యులు రాములునాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్లూరులో సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో ఇల్లెందు శాసన సభ్యురాలు హరిప్రియానాయక్, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కొరం కనకయ్య, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, వెంకటేశ్వర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్యం కారణంగా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు పోలింగ్‌కు హాజరుకాలేదు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధుసూదన్ కొత్తగూడెం, కల్లూరు, భద్రాచలంలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, బయ్యారం జడ్పీటీసీ అంగోతు బిందు ఖమ్మంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్ కొత్తగూడెంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం పోలింగ్ కేంద్రం పరిధిలో 221మంది ఉండగా 209 మంది, భద్రాచలం లో 84 మందికి 79 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం పోలింగ్ కేంద్రంలో 348 మందికి 326 మంది, కల్లూరు పోలింగ్ కేంద్రంలో 115 మందికి 114 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్లు అనుదీప్, గౌతమ్
కొత్తగూడెంలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేశారు. భద్రాచలంలో 84 మంది, కొత్తగూడెంలో 221 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పక్కా నిబంధనలు అమలు చేయాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. అనంతరం కేంద్రం బయట ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, కరోనా పరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో స్వర్ణలత, ఏఎస్పీ ప్రసాదరావు, డీఎస్పీ వెంకటేశ్వరబాబు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీవోలు ఉన్నారు. ఖమ్మంలోని పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు సి.సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు.
టీఆర్ఎస్దే గెలుపు: మంత్రి అజయ్
ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని మంత్రి అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. గులాబీ శ్రేణులు గెలుపు కోసం శ్రమించాయన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని మరోసారి రుజువు చేయనున్నదన్నారు.
ప్రత్యేక అనుమతితో ఆరుగురు ఓటర్లకు అవకాశం..
అనారోగ్య కారణాలతో ప్రొద్దుటూరు ఎంపీటీసీ పెంట్యాల భారతమ్మ, పంగిడి ఎంపీటీసీ బోడా ద్వాలి, రాంక్యాతండా ఎంపీటీసీ తేజావత్ రామి, కొణిజర్ల -2 ఎంపీటీసీ సూరంపల్లి సుశీల, ఎంపీటీసీ ఆవుల తులసమ్మ, తిరుమలాయపాలెం ఎంపీటీసీ ధరావత్ విజయ ఎన్నికల అధికారుల ప్రత్యేక అనుమతి తీసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్ట్రాంగ్ రూంకు బ్యాలెట్ బాక్సులు..
మామిళ్లగూడెం డిసెంబర్ 10: పోలింగ్ కేంద్రాలను సీపీ విష్ణు ఎస్ వారియర్, భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి సలహాలు సూచనలిచ్చారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాలెట్ బాక్స్‌లకు ఎన్నికల పరిశీలకుడు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్ పోలీసుల బందోబస్తు మధ్య సీల్ వేయించారు. స్ట్రాంగ్ రూం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
గెలుపుపై టీఆర్ఎస్ నేతల ధీమా..
పోలైన 738 ఓట్లలో మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్కే పడినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ ఎన్నిక ఖాయమైందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. సీపీఎం ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించగా చివరి నిమిషంలో ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఓటర్లూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మంలోని పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఓటు వేసిన వారు పోలింగ్ కేంద్రంలో ఉండరాదన్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేసిన వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
టీఆర్ఎస్దే గెలుపు..
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు అన్నారు. శుక్రవారం వారు కొత్తగూడెంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. మెజారిటీ సభ్యులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కాగా నిబంధనలు అమలు చేయాలని ఆర్డీవో స్వర్ణలతకు సూచించారు. వారి వెంట జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎన్నికల ఏజెంట్ నల్లమల వెంకటేశ్వరరావు ఉన్నారు.