
శరవేగంగా చేరుతున్న పెట్టుబడి సాయం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు
సూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎప్పటి మాదిరిగా ఈ సారి సాగు సీజన్లో సైతం రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్ ప్రకటించి నిధులు మంజూరు చేసిన వెంటనే దశలవారీగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. తొలిరోజు మంగళవారం ఎకరం లోపు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 2.54లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.79.81 కోట్లు జమవగా రెండోరోజు బుధవారం రెండెకరాల్లోపు 2.56లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.187.55కోట్లు జమయ్యాయి. ఉమ్మడి జిల్లా వారీగా పరిశీలిస్తే సూర్యాపేట జిల్లాలో బుధవారం 73,389మంది రైతులకు రూ.53,88,43,444, నల్లగొండ జిల్లాలో 1,25,446మంది రైతులకు రూ.92,68,80,236, యాదాద్రి జిల్లాలో 56,709మంది రైతులకు రూ.40,97,25, 272 జమయ్యాయి. రెండ్రోజుల్లో మొత్తం 5.11లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ.267.36కోట్లు జమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కనీసం పట్టించుకున్న నాధుడే లేకపోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నీళ్లు, కరెంటు పుష్కలంగా అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నారు. వీటికి తోడు సాగుబాట పట్టేకంటే ముందే రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి మొత్తం 10రోజుల్లో కేటగిరీల వారీగా రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది.