
మహబూబ్నగర్ నవంబర్ 29 : యాసంగిలో రైతులు లాభదాయక పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మండల, జిల్లా అధికారులతో యాసంగి సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగి పంటల సాగుపై అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రస్తుతం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే పోడు భూములకు సం బంధించిన దరఖాస్తులను బుధవారంలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అన్ని మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వసతిగృహాలు, పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. కొవిడ్ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్ వినియోగించాలని కోరారు.
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదునూ పరిష్కరించేందుకు సం బంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలస్థాయిలోనే సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్ర జావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. కాగా, ప్రజావాణికి 57 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య పాల్గొన్నారు.
133 ధరణి దరఖాస్తులు పెండింగ్
ధరణిలో నమోదైన 133 దరఖాస్తులు పెండింగ్లో ఉ న్నాయని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. వాటన్నింటిని పరిష్కరించడంతోపాటు పెండింగ్ రిజిస్ట్రేషన్లు కూ డా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ కార్పొరేషన్ ద్వారా భూమిలేని పేద ఎస్సీల కోసం 2014కు పూర్వం 900ఎకరాలు, 2014 తర్వాత 272ఎకరాలను కొ నుగోలు చేసినట్లు తెలిపారు. సంబంధిత భూములను లబ్ధిదారులే సాగు చేసుకునేలా చూడాలని సూచించారు.