తెలంగాణ పోరులో భూపాలపల్లి ప్రత్యేకం
2009లో ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ దీక్ష
నాడే ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభం
ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు నిరంతరం
1540 రోజులపాటు కొనసాగిన దీక్షలు
అత్యధిక రోజులు దీక్ష చేసిన గడ్డగా గుర్తింపు
సకల జనుల మద్దతుతో ముందుకు..
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్29 (నమస్తే తెలంగాణ): 2009వ సంవత్సరం.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులవి. స్వరాష్ట్ర సాధన కోసం సకల జనులూ పోరుబాట పట్టిన సందర్భమది.. ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. అన్న నినాదంతో ఉద్యమనేత కేసీఆర్ కరీంనగర్లో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా, పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో తెలంగాణ సమాజం ఒక్కసారిగా భగ్గుమన్నది. ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఉద్యమకారులు రోడ్డెక్కారు. ఉద్యమసారథి చూపిన బాటలోనే నాడు ఊరూరా వెలిసిన దీక్షా శిబిరాలు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కొనసాగాయి. మలిదశ ఉద్యమానికి ఆయువుపట్టులా నిలిచిన నిరాహార దీక్షలు భూపాలపల్లి గడ్డపై అత్యధికంగా 1540 రోజులు నిరంతరంగా కొనసాగాయి.
స్వరాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న వేళ.. 2009లో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ కరీంనగర్లో అరెస్ట్ అనంతరం ఊరూరా దీక్షా శిబిరాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో భూపాలపల్లి కేంద్రంగా జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షలు యావత్ తెలంగాణకు ఆదర్శంగా నిలిచాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కొనసాగింపుగా 2009లో ప్రారంభమైన దీక్షలు ఏకం గా 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చేవరకు నిరంతరంగా 1540 రోజులపాటు కొనసాగాయి. దీక్షలు చేపట్టడమే కాదు.. ఉద్యమ ప్రముఖులను పిలిచి, వారి ప్రసంగాలతో ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిల్చిన ఘనత భూపాలపల్లి జేఏసీ నాయకులకు దక్కింది. పైడిపల్లి రమేశ్, జోగుల సమ్మయ్య, బాబర్, గీసే సంపత్, దొంగల రాజేందర్,చిత్తరంజన్‌తో పాటు 30మంది జేఏసీ నాయకులు నిరంతరంగా దీక్షలను కొనసాగించారు. 170వ, 300వ రోజు దీక్షా శిబిరానికి గాయకుడు దేశపతి శ్రీనివాస్, 365వ రోజు దీక్షలో తన్నీరు హరీశ్‌రావు, నల్లాల ఓదెలు, అరవింద్‌రెడ్డి, 600వ రోజు దీక్ష సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, 700వ రోజు దీక్షకు దాస్యం వినయ్‌భాస్కర్, తెలంగాణ ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా జేఏసీ చైర్మన్ ఆచార్య పాపిరెడ్డితోపాటు కాకతీయ విశ్వవిద్యాలయాలనికి చెందిన పలువురు విద్యావేత్తలు సందర్శించారు. పదునైన ప్రసంగాలతో తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను తట్టిలేపి ఉద్యమ బాటలో నడిపించారు.
అత్యధిక రోజులు ఇక్కడే..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఊరూరా దీక్షా శిబిరాలు వెలిశాయి. అయితే సుదీర్ఘకాలంపాటు అలుపెరుగకుండా దీక్షలు కొనసాగించిన కేంద్రంగా భూపాలపల్లి అగ్రభాగాన నిలిచింది. తెలంగాణలోని ఆదిలాబాద్, సుల్తానాబాద్, సిద్దిపేట, బోడుప్పల్లో జేఏసీల ఆధ్వర్యంలో 1500 రోజలు దీక్షలు చేయగా, భూపాలపల్లిలో మాత్రం 1540 రోజులు నిరంతరంగా కొనసాగాయి. నాడు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలు సకలజనులను ఏకంచేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్రపోషించాయి.