
41 రోజుల పాటు కొనసాగనున్న ఆధ్యాత్మిక వైభవం
అయ్యప్ప స్వామి ఆలయాలతో ప్రజల్లో భక్తిభావం
మెదక్రూరల్, నవంబర్ 28: అయ్యప్ప మాలాధారణ వేసేవారు కార్తిక మాసం నుంచి మార్గశిర పుష్యమాసం వరకు 41 రోజుల పాటు కఠిన నియమాలతో గడుపుతారు. కొవిడ్ మొదటి, రెండు దశల్లో మాలాధారణ వేయని భక్తులు ఈ ఏడాది పెద్ద ఎత్తున దీక్ష చేపడుతున్నారు. మాలాధారణ చేసినవారు తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో వీరి దినచర్య మొదలవుతుంది. వీరు నల్లని వస్ర్తాలు ,తులసి మాల నుదుట విభూదిపై గంధం బొట్టు పెడుతారు. కటిక నెలమీద పడుకుంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తారు. దీక్ష తీసుకునే వారు గురు స్వామి వద్దనుంచి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి. 41 రోజలు కఠిన నియమాలను అనుసరించి ఆఖరి రోజు ఇరుముడితో శబరి మలై స్వామి దర్శనార్థం వెళ్తారు. అక్కడికి చేరుకున్న భక్తులు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రతో పంబా నదికి చేరుకుని స్నానం చేసి ఇరుమూడి తలపై పెట్టుకొని సన్నిధానం వ ద్ద ఉన్న 18 మెట్ల ను 41 రోజు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించి న వారుమాత్రమే మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని భక్తుల నమ్మకం. ప్రతి రోజు ఉదయం పూజ అనంతరం తప్పనిసరిగా దగ్గరలోని దేవాలయాన్ని దర్శించుకోవాలి. కాళ్లకు చెప్పులు ధరించకూడదు. పురుషులు వృద్థాప్యం వచ్చేవరకు, మహిళలు పదేళ్లలోపు పిల్లలు, 50ఏండ్లు దాటిన వారు దీక్షను ఆచరించవచ్చు.
అయ్యప్ప దీక్షతో భక్తి ,ఆరోగ్యం
స్వామి దయ వల్లన అంతా బాగానే ఉంది. నేను అయ్యప్ప స్వామి మాల ఇప్పటికీ 6సార్లు మాల వేశాను. మాల వేసినప్పటి నుంచి శబరిమలై యాత్రకు వెళ్లాను. అయ్యప్ప దీక్షలో భక్తి ముక్తితో సహా ఆరోగ్యం,మానసిక ప్రశాంతత ఉంటుంది .
– సంగమేశ్వర్ స్వామి. మెదక్