
ఎన్జీ కళాశాలలో హెలిప్యాడ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ, డిసెంబర్ 27 : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి మారయ్య మృతి చెందగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బుధవారం సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్జీ కళాశాలలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. శాశ్వతంగా నిర్మిస్తున్న హెలిప్యాడ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్జీ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వాటికి కావాల్సిన నిధులకు ప్రత్యేకంగా డీపీఆర్ చేయించారు. ఎన్జీ కళాశాలలో ఆరు వేల మంది విద్యార్థులు చదువుతుండగా వారికి ఇబ్బంది లేకుండా కొత్త భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరే అవకాశం ఉంది. వీటితోపాటు నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగేందుకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పిల్లి రామరాజు, ఖయ్యూంబేగ్, దేప వెంకట్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు, గాదె రాంరెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్యే కిశోర్‌ను కలిసిన ఎస్పీ
నల్లగొండ రూరల్ : సీఎం కేసీఆర్ నల్లగొండకు వస్తున్నందున ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఎమ్మెల్యే కిశోర్‌ను కలిసి ఆయన ఇంటి వద్ద భద్రత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బాలగోపాల్, సీఐ రాఘవులు ఉన్నారు.