
ఇంటికి నాలుగు చొప్పున ఆవులు, గేదెలు, మేకలు
నిత్యం 1200 లీటర్ల పాల సేకరణ
కల్వకుర్తి పట్టణంలో విక్రయం
ఉదయం 8 తర్వాత తిరిగి సాగు పనులకు..
ఆదాయంతోపాటు జీవనోపాధి పొందుతున్న రైతులు
కల్వకుర్తి రూరల్, డిసెంబర్ 26: సంజాపూర్.. అదో కుగ్రామం. పచ్చని పంటలతోపాటు పాడికి పేరెన్నిక. గ్రామంలో పాలు వెల్లువలా లభ్యమవుతాయి. మొత్తం 100 ఇండ్లు.. 300లకుపైగా జనాభా.. ప్రతి ఇంటికీ సగటున నాలుగు చొప్పున ఆవులు, గేదెలు, మేకలు ఉంటాయి. వీటి నుంచి నిత్యం 1200 లీటర్ల పాలను గ్రామస్తులు సేకరిస్తారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పాల పనుల్లో నిమగ్నమవుతారు. సేకరించిన పాలను సైకిళ్లు, బైక్‌లపై కల్వకుర్తి పట్టణానికి తీసుకెళ్లి విక్రయిస్తారు. ఒక్కో వ్యక్తి సీజన్‌ను బట్టి 15 నుంచి 25 లీటర్ల వరకు సేకరించడంతో నిత్యం రూ.వెయ్యి వరకు ఆదాయం సమకూరుతున్నది. ఆ తర్వాత గ్రామానికి చేరుకొని తిరిగి సాగు పనులకు వెళ్తారు. వ్యవసాయంతోపాటు పాడికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నదని
స్థానికులు సంతోషంగా చెబుతున్నారు.
సంజాపూర్..అది ఒక చిన్న గ్రామం.. అక్కడి ప్రజలు వ్యవసాయాన్ని ఎంత ఆదరిస్తారో .. పాడికి అంతే ప్రాధాన్యమిస్తారు. తమ వద్ద ఉన్న పశువులను పశుసంపదగా భావిస్తారు. ఆ గ్రామం గతంలో తర్నికల్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉండగా.. ప్రస్తుతం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిపై ఉన్నది. గ్రామంలో వందలోపు ఇండ్లు, 300 వరకు జనాభా ఉన్నారు. రైతుల పంట పొలాలు చెరువులకు, ఎంజీకేఎల్ఐ కాల్వకు అతి సమీపంగా ఉండడంతో ఏడాదికి రెండేసి పంటలు సాగు చేస్తున్నారు. దీనికి తోడుగా ప్రతి ఇంటికీ సగటున నాలుగు చొప్పున ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలతో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
సంజాపూర్ గ్రామం కల్వకుర్తి పట్టణం నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్నది. గ్రామం పచ్చటి పంట పొలాల నడుమ చక్కటి వాతావరణంలో ఉంటుంది. గ్రామంలో దాదాపుగా 80నుంచి 100 వరకు ఇండ్లు ఉండగా మొత్తం మూడు వందల పైచిలుకు జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయంతో పాటు నిత్యం పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కల్వకుర్తి పట్టణం అతి సమీపంలో ఉండడంతో నిత్యం ఆవులు, బర్ల ద్వారా సేకరించిన పాలను పట్టణంలో ఇంటింటికీ, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. నిత్యం దాదాపుగా 1200 లీటర్ల పాలను తమ గ్రామం నుంచి పట్టణ ప్రజలకు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఉదయం 6గంటలనుంచి 8గంటల వరకు పాల వ్యాపారం చేసి తిరిగి ఇంటికి వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు.
వ్యవసాయంతో పాడి పరిశ్రమ..
గ్రామంలో ప్రతి రైతు వ్యవసాయ పొలంలో పశువుల పాకలు కనిపిస్తాయి. పంటలతో పాటు పశువులకు కోసం కొద్దిభాగం పచ్చి చొప్పను సాగుచేస్తారు. ఇక్కడి ప్రజలకు తర్నికల్ చెరువు, ఎంజీకేఎల్ఐ కాల్వ అతి సమీపంగా ఉండడంతో సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాలువ రాక ముందు బోర్ల పైనే ఆధారపడి ఉండే పరిస్థితి. కాలువ పనులు పూర్తయి నీరందడంతో వానకాలం, యాసంగిలో చక్కగా పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ,మొక్కజొన్న, పత్తితో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. గతంలో సంవత్సరానికి ఒకటి చొప్పున పంటల సాగు ఉండగా ఎంజీకేఎల్ఐ నీటి రాకతో గ్రామంలో ఎటూ చూసినా పచ్చటి పైర్లతో పంట పొలాలు కళకళలాడుతూ దర్శనమిస్తాయి. యువకులు ఉదయం 5గంటల నుంచి ఆరు గంటల వరకు పాలను సేకరించి కల్వకుర్తి పట్టణానికి సైకిళ్లు, బైక్‌లపైన తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో వ్యక్తి సగటున సీజన్‌ను బట్టి 15లీటర్ల నుంచి 25లీటర్ల వరకు పాలను విక్రయిస్తారు. దాదాపుగా రోజు రూ.వెయ్యి వరకు పాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వ్యవసాయంలో పంట దిగుబడి, ధరలు హెచ్చు తగ్గులున్నా పాల ఉత్పత్తితో వారు రెండింటిని సమన్వయం చేసుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా తమకు సరైన విధంగా రుణాలు అందిస్తే ప్రతి ఇంటి నుంచి పాల ఉత్పత్తిని మరింతగా పెంచుకునే వీలుందంటున్నారు.
పాలతో ఉపాధి ..
మా గ్రామ ప్రజలంతా చాలా సంవత్సరాలుగా వ్యవసాయంతో పాటుగా పాల ఉత్పత్తి చేస్తున్నారు. పొలాల వద్దనే మా ఇండ్లు ఉండడంతో వ్యవసాయం పాడి పరిశ్రమ సమంగా చేయగలుగుతున్నాం. రోజు మా ఊళ్ల నుంచి వెయ్యి లీటర్లకు పైగా పాలను కల్వకుర్తికి తీసుకెళ్లారు. ఎంజీకేఎల్ఐ రాకతో ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. ప్రభుత్వం రుణాలు అందిస్తే మరిన్ని పశువులతో పాలదిగుబడిని పెంచుతాం.
పశువులే మా సంపద..
పశువులను మా గ్రామ సంపదగా భావిస్తాం. రోజు పాలను సేకరించి అమ్మితే మాకు పైసలు వస్తాయి. పశువులను భారంగా కాకుండా కుటుంబంలా చూసుకుంటం. బర్రెల కోసమే పచ్చి గడ్డిని పెంచుతాం. మా గ్రామంలో శానా ఏండ్లుగా చాలా మంది పొద్దుగాల, మాపటికి పాలను అమ్ముతరు. పశువులతోనే పైసలు సంపాదిస్తూ చాలా మంచిగా జీవిస్తున్నాము.