రైతుల ప్రయోజనాలు దానికి పట్టవు
ఎఫ్‌సీఐని ఎత్తేసే కుట్ర చేస్తున్న కేంద్రం
తీన్మార్ మల్లన్నా.. తీరు మార్చుకో..
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హితవు
భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 26 : ‘బీజేపీ.. బడా వ్యాపారులకు కొమ్ముకాసే పార్టీ.. దానికి రైతుల ప్రయోజనాలు పట్టవు’ అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఆదివారం క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం అన్ని పార్టీలకు చెందిన రైతు సంఘాలు, రైతులు సుదీర్ఘ పోరాటాలు చేయడంతో కేంద్రం బిల్లును వెనక్కి తీసుకుందని తెలిపారు. కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ఆ చట్టాలు మళ్లీ వస్తాయని కేంద్రం నిజస్వరూపం బయటపడిందని అన్నారు. ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడడం తీన్మార్ మల్లన్నకు సరికాదన్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం జర్నలిజం కాదన్నారు. ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ పబ్బంగడుపుతోందని మండిపడ్డారు.చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎకనామిక్ సర్వే సీఎం పనితీరుకు ర్యాంకింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
నెల రోజుల్లో జిల్లా ఆసుపత్రి ప్రారంభించే చాన్స్
జిల్లా ఆసుపత్రిని నెలరోజుల్లో ప్రారంభించే అవ కాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే రమణారెడ్డి తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 204 మంది పర్మనెంట్ ఎంప్లా యీస్ను రిక్రూట్ చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆసుపత్రి అభివృద్ధికి రూ.56 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఆస్పత్రుల అభివృద్ధికి రూ.200కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, మొదటి ప్రాధాన్యంగా భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి నిధులు రాబోతున్నాయని అన్నారు. అన్నీ అనుకూలిస్తే నెల రోజుల్లో భూపాలపల్లి జిల్లా ఆసుపత్రి సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలు కొత్త వేరియంట్ కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్థన్, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీటీసీ జోరుక సదయ్య, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, నేతలు వజ్రమణి, నూనె రాజు, శిరుప అనిల్, మందల విద్యాసాగర్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, పైడిపల్లి రమేశ్, నాగుల రాజిరెడ్డి, బండారి రవి, పింగిళి రవీందర్‌రెడ్డి, బుర్ర రాజు, బీబీ చారి, కరీం తదితరులు పాల్గొన్నారు.