ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చర్చిల్లో సందడే.. సందడి
చిన్నాపెద్దలతో కిటకిటలాడిన చర్చిలు
ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన, సంకీర్తనలతో మార్మోగిన మందిరాలు
ప్రేమ, శాంతి సందేశాలిచ్చిన పాస్టర్లు
ఆకట్టుకున్న చిన్నారుల ఆటాపాట
వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
నమస్తే తెలంగాణ, నెట్వర్క్;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద నూతన వస్ర్తాలు ధరించి కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. పండుగ సందర్భంగా చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక ప్రార్థనలతో పాటు ఆరాధన, సంకీర్తనలతో మందిరాలు మార్మోగాయి. పాస్టర్లు ప్రేమ, శాంతి సందేశాలిచ్చారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. చర్చిల వద్ద ఏసు, మరియమ్మ, శాంటాక్లాజ్ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు చర్చిల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని కేక్‌లు కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. శనివారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కులమతాలకతీతంగా ప్రజలు చర్చిలకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా చర్చిలను స్టార్లు, క్యాండిల్స్, శాంటాక్లాజ్, క్రిస్మస్ టీ, తదితర సామగ్రితో సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రివేళల్లో విద్యుత్ కాంతులతో శోభాయమానంగా కనిపించాయి. క్రైస్తవ సోదరులు కొత్త దుస్తులను ధరించి చర్చిలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఏసుక్రీస్తు విశ్వానికి మార్గం చూపే లోక రక్షకుడని, ఆయన చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. శాంతి, ప్రేమ, దయ, కరుణతో జీవించాలన్నారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అనంతరం పాస్టర్ల ఆశీర్వాదాలను పొందారు. ఏసుక్రీస్తు, మరియమ్మ వేషధారణలో చిన్నారులు అలరించారు. క్రిస్మస్ తాత చిన్నారులతో ఆటలాడి సందడి చేశారు. ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతో పాటు బైబిల్ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, నాయకులు చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.