
గుండాల, నవంబర్ 23 : గ్రామం చిన్నదే కానీ, అభివృద్ధిలో మాత్రం ముందువరుసలో ఉన్నది. అదే.. మండలంలో కొత్తగా ఏర్పడిన పాచిల్ల గ్రామపంచాయతీ. 800 మంది జనాభా, 480 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను సక్రమంగా వినియోగిస్తూ పల్లెను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.2లక్షలతో డంపింగ్యార్డు, రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రూ.3లక్షలతో సీసీ రోడ్డు వేయించారు.
అభివృద్ధి పనులు పూర్తి
ప్రభుత్వం నిర్దేశించిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు నిర్మాణం పూర్తయ్యాయి. పనులు పూర్తి కావడంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామస్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగాయి.
పరిశుభ్రంగా గ్రామం..
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడంతోపాటు మురుగునీటి కాల్వలను గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. పల్లె ప్రగతి పనులతో గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తున్నది. హరితహారంలో భాగంగా గ్రామంలోని వీధుల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. గ్రామ నర్సరీలో 10 వేల మొక్కలు పెంచి వీధుల్లో నాటడమే కాకుండా ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. అభివృద్ధి పనులతో పల్లె రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరింత అభివృద్ధి చేస్తాం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. మున్ముందు మరిన్ని పనులు చేపడతాం. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రోజూ చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. మురుగు నీటి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. గ్రామాభివృద్ధిలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది.
-పందుల రేఖ, సర్పంచ్
పకడ్బందీగా పనులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా చేశాం. వార్డు సభ్యుల సలహాలు, సూచనలతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం పనులను పూర్తి చేశాం. గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం.
-అత్తి భాస్కర్, ఉప సర్పంచ్